Emergency Number : డయల్ 100. ఎంతో ఫేమస్. ఆపదలో ఉన్నామని ఒక్క కాల్ చేస్తే చాలు.. పోలీసులు కుయ్ కుయ్ మంటూ వాహనాల్లో వచ్చి వాలిపోతారు. ఎలాంటి ప్రమాదం నుంచైనా రక్షిస్తారనే నమ్మకం. ఈ రోజుల్లో అర్థరాత్రి ఆడపిల్ల నడిరోడ్డుపై ఒంటరిగా నడస్తోందంటే.. అందుకు డయల్ 100 కారణం. ఆ నెంబర్ అంతటి ధీమా కల్పించింది ప్రజలకు. అయితే, ఇక్కడో చిన్న ఇబ్బంది కూడా ఉంది. అగ్నిప్రమాదం జరిగితే కూడా డయల్ 100 కే కాల్ చేస్తుంటారు. మెడికల్ ఎమర్జెన్సీకి కూడా అదే నెంబర్‌కు ఫోన్ చేసేవాళ్లు. ఇంకా అనేక విభాగాల్లో కీలక నెంబర్లు ఉన్నా.. జనాలకు అవేవీ గుర్తు లేవు. కేవలం డయల్ 100నే మైండ్‌లో గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అలాంటి ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించడానికే కేంద్రం సరికొత్తగా డయల్ 112 తీసుకొచ్చింది. ఒకే నెంబర్‌తో అన్ని రకాల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ విధానాన్ని లేటెస్ట్‌గా తెలంగాణ సర్కారు కూడా అందిపుచ్చుకుంది. ఇకపై ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా.. 112కు ఫోన్ చేయాలి. అందుకే ఈ కొత్త నెంబర్ బాగా గుర్తు పెట్టుకోండి.
తెలంగాణలో ఇకపై ఎమర్జెన్సీ నెంబర్ మారింది. ఇప్పటి వరకు అత్యవసర సేవల కోసం డయల్ 100 ఉండేది. ఇకపై దేశవ్యాప్తంగా ఒకే ఒక ఎమర్జెన్సీ నెంబర్.. అది 112. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే నెంబర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ తెలంగాణలో పోలీసుల హెల్ప్ లైన్ కోసం 100.. ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు 101.. మెడికల్ అర్జెన్సీకి 108.. చైల్డ్ కేర్‌కు 1098.. ఇలా పలు విభాగాలకు వేరు వేరు అత్యవసర నెంబర్లు ఉండేవి. ఇకపై ఇలాంటి అన్ని సేవల కోసం 112 నెంబర్‌కు డయల్ చేస్తే సరిపోతుంది. ఈ నెంబర్‌కు డయల్ చేస్తే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి వెంటనే సంఘటన స్థలానికి అధికారులను పంపించేలా ఏర్పాటు చేశారు.
అండ్రాయిడ్ ఫోన్లలో మరో సరికొత్త సేవను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితో ఆటోమెటిక్‌గా ఎమర్జెన్సీ నెంబర్‌కు డయల్ కానుంది. ఇక కీ ప్యాడ్ ఫోన్లలో అయితే 5 లేదా 9 నిమిషాల కంటే ఎక్కువసేపు నొక్కి ఉంచితే ఎమర్జెన్సీ సాయం అందుబాటులోకి వస్తుంది.