
Telangana BRS latest news(Political news today telangana) :
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ముందుగానే విడుదల చేసి తెలంగాణ రాజకీయాలను బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ వేడెక్కించారు. అదే ఇప్పుడు ఆ పార్టీలో అసంతృప్త జ్వాలలను రాజేసింది. అభ్యర్థుల జాబితా వెలువడి 10 రోజులైనా టికెట్ ఆశించి భంగపడిన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు అసంతృప్త స్వరాన్ని మాత్రం తగ్గించడం లేదు.
తమ రాజకీయ భవిష్యత్తుపై అసంతృప్త నేతలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడానికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని కొందరు నేతలు ఆశావహ దృక్పథంతో ఉన్నారు. దాదాపు 12 నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు మెట్టు దిగడంలేదు. ప్రగతిభవన్ దిశా నిర్దేశంతో బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నాయి. ఆ ప్రయత్నాలు మాత్రం పెద్దగా సత్ఫలితాలను ఇవ్వడంలేదు.
కొందరు నేతలు మాత్రం అమెరికా టూర్ లో ఉన్న కేటీఆర్ ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఆయన హైదరాబాద్ చేరుకోగానే భేటీ కావాలని టికెట్ ఆశించి భంగపడిన నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు మైనంపల్లి , ముత్తిరెడ్డి, రాజయ్య, మదన్‌రెడ్డి వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు జాబితా ప్రకటన తర్వాత బీఆర్‌ఎస్ అధినేత ఆదేశాలతో పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని లెక్కలేస్తున్నాయి. సర్వే ఫలితాల ఆధారంగా కొందరు అభ్యర్థులను మార్చక తప్పదనే ఆశతో బీఆర్‌ఎస్ ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఎన్నికల ప్రచారంపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిపెట్టింది. నియోజకవర్గాలకు ప్రచార సామగ్రిని తరలించే పని చేపట్టింది. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను పార్టీ అభ్యర్థులకు అందజేస్తున్నారు. పార్టీ జెండాలు, కండువాలు, టోపీలు, తోరణాలు తెలంగాణ భవన్ నుంచి నియోజకవర్గాలకు తరలించారు.
ఇంకోవైపు తమ తమ నియోజకవర్గంలో ప్రచారానికి రావాలని మంత్రి హరీష్‌రావు, కవితపై పార్టీ అభ్యర్థులు ఒత్తిడి తెస్తున్నారు. అలాగే అక్టోబర్ 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో గులాబీ బాస్ ఉన్నారు. ఆలోగా ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని భావిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవిత ప్రచార షెడ్యూల్ పై కసరత్తు జరుగుతోంది.