
YS Sharmila news today(Latest political news telangana) :
వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ విలీనం చేసే ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఢిల్లీలో సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. 50 నిమిషాలకుపైగా చర్చలు జరిపారు. ఈ చర్చలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.
సోనియా, రాహుల్ తో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని షర్మిల తెలిపారు.సోనియా గాంధీతో భేటీ తర్వాత మాట్లాడిన షర్మిల.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం రాజన్న బిడ్డ పనిచేస్తోందన్నారు.
కొంతకాలం షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కుటుంబంతో కలిసి ఆమె ఢిల్లీకి వెళ్లడం ఆసక్తిగా మారింది. సోనియా గాంధీతో చర్చలు జరపడంతో ఇక ఆ పార్టీ విలీనం చేయడం ఖాయమని తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్.
షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ కోరుతున్నారు. గతంలోనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ మాజీమంత్రి తుమ్మల కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే స్థానం ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ అంశం కూడా కీలకంగా మారింది.
మరోవైపు షర్మిలకు సికింద్రాబాద్ టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. అక్కడ బీజేపీ నుంచి జయసుధ పోటీ చేసే ఛాన్స్ ఉంది. క్రిస్టియన్ ఓట్లు అధికంగా ఉన్న సికింద్రాబాద్ నుంచి షర్మిలను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. ఒక వేళ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుంటే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల మాట. ఆమె సేవలు ఏపీలో వినియోంచుకోవాలనే యోచనలోనూ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఉన్నారు. మరి షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఎప్పుడు? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.