
Elephant incident in Chittoor(Andhra pradesh today news) :
చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. గుడిపాల మండలంలోని 190 రామాపురం, సీకే పల్లిలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ముగ్గురిపై దాడి చేసింది. 190 రామాపురంలో దంపతులపై దాడి చేసి చంపేసింది. పొలం పనుల కోసం వెళ్లిన దంపతులు వెంకటేశ్ , సెల్విపై దాడి చేయడంతో వారిద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు.
సీకే పల్లికి చెందిన సుధాకర్ తోటలో ఏనుగు తిరుగుతుండటాన్ని గమనించి బసవాపల్లికి చెందిన యువకుడు కార్తీక్ వెళ్లగా అతడిపై దాడి చేసి దంతాలతో పొడిచింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఏనుగును బంధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రామకుప్పం నుంచి జయంత్, వినాయక్ అనే రెండు కుంకీ ఏనుగులను గుడిపాలకు తీసుకొచ్చారు. ఆపరేషన్ గజ పేరుతో ఏనుగును బంధించేందుకు యత్నిస్తున్నారు. ఇద్దరిని చంపిన ఏనుగును బంధిస్తామని DFO చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని చెప్పారు. గాయపడిన వ్యక్తి చికిత్సకు అయ్యే ఖర్చంతా.. ప్రభుత్వమే భరిస్తుందని DFO వెల్లడించారు.