BJP Ticket Controversy స్వేఛ్చ బ్యూరో: జగిత్యాల బీజేపీలో ముసలం ముదిరింది. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒంటెత్తు పోకడలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ బోగ శ్రావణి తీరుపై పార్టీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. టికెట్లు అమ్ముకునే స్థాయికి బీజేపీ దిగజారిందా? అంటూ సీనియర్లు వేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజాయితీకి నిలువుటద్దం, క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే కాషాయ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎంపీ ధర్మపురి అర్వింద్ కనుసన్నల్లో నియోజకవర్గ ఇన్ చార్జీ బోగ శ్రావణి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీని వ్యాపార సంస్థగా మార్చేశారని సొంత పార్టీ నేతలే రోడ్డెక్కడం సంచలనంగా మారింది.
మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగాయని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఒక్కో టికెట్‌ను రూ.5 లక్షలకు అమ్ముకున్నారని, డబ్బులు ఇచ్చిన వారికే బీ-ఫారాలు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండా మోసినోడు రోడ్డున పడ్డాడని, నోట్ల కట్టలు విసిరినోడు అభ్యర్థి అయ్యాడంటూ కేడర్ బహిరంగంగానే విమర్శిస్తోంది. బీ-ఫామ్ అందుకున్న వారిలో కనీసం వార్డు మెంబర్‌గా గెలిచే సత్తా ఉన్న వారు కూడా లేరని, అసలైన బలమున్న అభ్యర్థులను పక్కన పెట్టడం వెనుక అర్వింద్, శ్రావణిల లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ అర్వింద్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆయన ఓటమి జగిత్యాల నుంచే ప్రారంభమని, సీనియర్లంతా దీనికి ఏకమవుతామని బహిరంగంగానే స్పష్టంచేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నక్సలైట్ల తూటాలకు భయపడకుండా బీజేపీ కోసం పని చేస్తే టికెట్ ఇవ్వలేదని ఓ కార్యకర్త తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. 40 ఏండ్లుగా తన తల్లితండ్రులతో పాటు తన వరకు అంతా బీజేపీ పార్టీకే పనిచేస్తున్నామని, అలాంటిది కండువా కూడా కప్పుకోని వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ కంటతడి పెట్టుకోవడం గమనార్హం.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై వ్యతిరేకత ఈనాటిది కాదు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఫిబ్రవరిలోనే ఆయన తీరును నిరసిస్తూ రాష్ట్ర కార్యాలయం ఎదుట జగిత్యాలకు చెందిన నేతలు నిరసన వ్యక్తంచేశారు. కాగా ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనను ఈ సందర్భంగా పలువురు శ్రేణులు గుర్తు చేసుకున్నారు. కాగా ఈసారి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి అర్వింద్ నాయకత్వంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాష్ట్ర నాయకత్వం ఎలాగూ పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా స్పందించకపోతే జగిత్యాలలో బీజేపీ ఖాళీ అవ్వడం ఖాయమని ఓవర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోకపోతే జగిత్యాల గడ్డపై బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ‘పెట్రోల్’ నిరసనల నుంచి ‘టికెట్ల అమ్మకాల’ వరకు అర్వింద్ చుట్టూ తిరుగుతున్న వివాదాలు రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
Also Read: Potato Halwa: బంగాళాదుంపలతో చేసే టేస్టీ హల్వా, తక్కువ పదార్థాలతో ఇంట్లో చేసే రుచికరమైన స్వీట్