
DK Aruna at TS Assembly (Political news in telangana):
హైకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికల అఫిడవిట్‌లో అక్రమాల కారణంగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డీకే అరుణనే ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇది జరిగి వారం అవుతోంది. ఇప్పటికీ అరుణకు ఎమ్మెల్యే హోదా కట్టబెట్టడంపై సర్కారు తరఫున ఎలాంటి ముందడుగూ పడలేదు. ఇక లాభం లేదనుకున్న డీకే అరుణ స్వయంగా రంగంలోకి దిగారు.
తాజాగా అసెంబ్లీ కార్యదర్శిని కలవడానికి వెళ్లారు అరుణ. కానీ ఆమెకు నిరాశ ఎదురైంది. అసెంబ్లీ కార్యదర్శి అందుబాటులో లేరు. దీంతో జాయింట్ కార్యదర్శికి హైకోర్టు కాపీ అందచేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం బేషజాలకు పోకుండా తీర్పును గౌరవించాలన్నారు.
ఆ తర్వాత.. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్‌రాజ్‌ను కలిశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. తనను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు తీర్పు పత్రాన్ని వికాస్ రాజ్ కు అందజేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా.. తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని వినతి పత్రాన్ని సమర్పించారు.
త్వరలోనే పరిశీలించి సమాచారం ఇస్తానని వికాస్ రాజ్ అన్నారని, కోర్టు తీర్పును అమలు చేస్తారని నమ్మకం తనకు ఉందని డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు.
