అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబం అది. కానీ విధి చిన్నచూపు చూసింది. 21 ఏళ్ల వయసుకే స్ఫూర్తి అనారోగ్యంతో చనిపోయింది. తమ కుటుంబానికి జరిగిన ఈ అన్యాయం ఇంకెవరికీ జరగొద్దంటూ వారు నిర్ణయించుకున్నారు. అందుకే స్ఫూర్తి మరణానికి కారణాన్ని వివరించి, ఎవరూ అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. ఇంతకీ స్వప్నకి ఏమైంది..? ఆమె ఎందుకు చనిపోయింది..?
సందేశాత్మక ఫ్లెక్సీ..
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో స్ఫూర్తికి శ్రద్ధాంజలి అంటూ పలుచోట్ల ఫ్లెక్సీలు వేశారు కుటుంబ సభ్యులు. ఆమె తమకెంతో ప్రియమైనదని, ఆమె జ్ఞాపకాలు తమతో ఉన్నాయంటూ సహజంగా అన్ని ఫ్లెక్సీల్లో కనపడే మేటర్ అందులో లేదు. అందులో ఆలోచింపజేసే సందేశం ఉంది. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం, ఇంకెవరికీ జరగొద్దంటూ వారు ఆ సందేశంలో అందరినీ వేడుకున్నారు.
“మా కుటుంబం తరపున మీ అందరికీ ఒక విన్నపం. ప్లీజ్.. మా చెల్లికి జరిగినట్టు ఇంకెవ్వరికీ జరగకుండా చూడాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాం. దయచేసి మీ ఇంట్లో వారికి ఏ చిన్న జ్వరం వచ్చినా ఒకసారి ఆలోచించండి. మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోండి.” అంటూ ఆ ఫ్లెక్సీలో ఓ సందేశాన్ని ఉంచారు స్వప్న కుటుంబ సభ్యులు.
స్ఫూర్తి ఎందుకు చనిపోయిందంటే..?
ఎల్లుల్ల స్ఫూర్తి తల్లిదండ్రులతో కలసి నర్సింగ్ పల్లిలో నివాసం ఉంటోంది. ఆమె తల్లిపేరు స్వప్న. వీరిద్దరూ ఇటీవల ఒకేసారి అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరికీ వైరల్ ఫీవర్ వచ్చిందని తేలింది. తల్లి స్వప్న రెండు మూడు రోజుల్లో కోలుకుంది. కుమార్తె స్ఫూర్తి ఆరోగ్యం మాత్రం రోజు రోజుకీ క్షీణించింది. డెంగీ అని తేలిన తర్వాత ప్లేట్ లెట్స్ సంఖ్య క్రమక్రమంగా పడిపోయింది. నిజామాబాద్ ఆస్పత్రి చేతులెత్తేశారు. ప్లేట్ లెట్స్ పడిపోయాయని మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ కి తీసుకెళ్లారు. అయితే ఆమె చనిపోయింది. డెంగీతో కళ్లముందే స్ఫూర్తి చనిపోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
డెంగీ వ్యాధి ప్రాణాంతకమైనది కాదు కానీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలు తీస్తుంది. దోమకాటు వల్ల ఈ వ్యాధి వస్తుందని మనందరికీ తెలుసు. ఆ దోమలకు ఆవాసాలు ఏంటో కూడా మనకు తెలుసు. అపరిశుభ్ర పరిసరాలు, నిల్వ ఉన్న నీటిలో దోమలు పెరుగుతాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమ తెరలు వాడటం.. ఇలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ మనకు తెలిసినా కూడా ఎక్కడో ఓ చోట నిర్లక్ష్యం వెంటాడుతుంది. దానివల్ల మనం రోగాలబారిన పడతాం. డెంగీ వస్తే ముందుగానే గ్రహించి ఆస్పత్రికి వెళ్తే మందుల ద్వారా తగ్గుతుంది. మరీ ముదిరిన తర్వాత వెళ్తే మాత్రం కాస్త కష్టం. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండే కుటుంబాల్లో వ్యాధి నిర్థారణ కూడా కష్టమవుతుంది. వారిని అప్పటికప్పుడు ఆదుకునేవి మెడికల్ షాపుల వాళ్లు ఇచ్చే మందులే. కానీ రోజు మార్చి రోజు జ్వరం వస్తూ, వైరల్ ఫీవర్ అని అనుమానం వస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదంటారు వైద్యులు. స్ఫూర్తి విషయంలో కూడా అదే జరిగింది. అందుకే ఆమె కుటుంబ సభ్యులు అలాంటి విషాదం ఇంకే కుటుంబంలో జరగకూడదంటూ సందేశాత్మక ఫ్లెక్సీలు వేశారు. అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.