US Gun Firing Indians Dead| అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటనలు జరిగాయి. వరుసగా గురువారం, శుక్రవారం ఈ ఘటనలు జరగడం ఆందోళనకర విషయం. ఈ రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు భారతీయలు సహా అయిదు మంది మృతి చెందారు. తాజాగా న్యూ మెక్సికోలోని లాస్ క్రూసెస్ నగరంలో గన్ ఫైరింగ్ ఘటన జరిగింది. ఒక పార్కులో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు అందించారు.
శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో యంగ్ పార్కులో ఈ ఘటన జరిగింది. సమాచారం అందగానే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పార్కులో ఒక కార్ షో జరుగుతోంది. దీనికి దాదాపు 200 మంది హాజరయ్యారు. అయితే, ఈ కార్ షోకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. మీడియాతో లాస్ క్రూసెస్ పోలీస్ చీఫ్ జెరెమీ మాట్లాడుతూ.. పార్క్‌లో చెల్లాచెదురుగా 50 నుంచి 60 షెల్ కేసింగ్‌లు కనిపించాయని, దీనిని బట్టి చూస్తే, చాలామంది తుపాకీలతో కాల్పులు జరిపినట్లు అంచనా వేశామన్నారు.
పార్కులో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 15 మంది గాయపడ్డారు. మృతులంతా టీనేజర్లు. మృతులు, గాయపడిన వారి పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించినట్లు లాస్ క్రూసెస్ అగ్నిమాపక విభాగం చీఫ్ మైఖేల్ డేనియల్స్ తెలిపారు. లాస్ క్రూసెస్ నగర కౌన్సిలర్, మేయర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘటన గురించి ఒక పోస్ట్ చేసి విచారం వ్యక్తం చేశారు.
Also Read: భారత్ సుంకాలు తగ్గించాలి లేకుంటే.. ట్రంప్ వార్నింగ్
వర్జీనియాలో కాల్పులు: భారతీయ తండ్రి-కుమార్తె మృతి
అయితే, మరో ప్రాంతంలో కూడా కాల్పుల ఘటన జరిగింది. వర్జీనియాలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన తండ్రి, కుమార్తె మృతిచెందారు. వీరిని గుజరాత్‌కు చెందిన ప్రదీప్ కుమార్ పటేల్, ఆయన కూతరు ఉర్మిగా గుర్తించారు. ఈ క్రమంలో కాల్పులు జరిపిన నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ (44)ను వర్జీనియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. ప్రదీప్ పటేల్, ఆయన కుమార్తె ఉర్మి గురువారం రోజున వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో డిపార్ట్‌మెంటల్ స్టోర్‌కి వెళ్లారు. వారు స్టోర్‌లో ఉన్న సమయంలో నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ అక్కడికి చేరుకున్నాడు. తనకు మందు కావాలని అడగడంతో స్టోర్ సిబ్బందికి, అతనికి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం.. స్టోర్‌లో ఉన్న ఉద్యోగులపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ప్రదీప్ పటేల్, ఉర్మి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రదీప్ పటేల్ ఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఉర్మి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, కాల్పులు జరిపిన ఫ్రేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రదీప్ కుటుంబ వివరాలు
గుజరాత్‌లోని మెహసనా జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ పటేల్, తన భార్య హన్స్‌బెన్, కుమార్తె ఉర్మితో కలిసి ఆరేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. అక్కడ తన బంధువులకు చెందిన డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేస్తున్నారు. మృతుడు ప్రదీప్ కుమార్‌కు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు అహ్మదాబాద్‌లో, మరొకరు కెనడాలో ఉన్నారని చెప్పారు.