Voter Revision: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ , ఫారమ్‌ల డిజిటైజేషన్, మ్యాపింగ్ ప్రక్రియపై భారత ఎన్నికల సంఘం సెక్రటరీ నవీన్ కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా బృందం సబ్-డిస్ట్రిక్ట్ స్థాయితో కలిసి మంచి పని చేస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలు ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడి ఉన్నాయని సెక్రటరీ నవీన్ కుమార్ అన్నారు.
వెంటనే పరిష్కరించేలా చర్యలు..
మిగిలిన కేవలం రెండు రోజుల గడువును సద్వినియోగం చేసుకొని బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు)తో కలిసి పని చేసి నిర్దేశిత లక్ష్యాలను ముందుగానే పూర్తి చేయాలని కచ్చితంగా ఆదేశించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫారమ్‌లు, ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ… ఎరోలందరూ తమ బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలతో నేరుగా మాట్లాడాలన్నారు. ఫిర్యాదులు చేసిన ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంపై కమిషన్ చాలా కచ్చితంగా ఉందని, వీలైనంత త్వరగా పరిష్కరించాలని హెచ్చరించారు.
అధికారులకు అదేశాలు..
మ్యాపింగ్ కాని కేసులు జిల్లాలో చాలా ఉన్నాయని, అందులో షిఫ్ట్ అయిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వారితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకునేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లకు ప్రతిస్పందనలు వస్తున్నాయా? కాల్ చేసేవారి సమస్యలను సరిగా పరిష్కరిస్తున్నారా? అని సెక్రటరీ నేరుగా అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో ఎక్కువ సంఖ్యలో నోటీసులు జారీ చేయాల్సి ఉందని గమనించినట్లు చెప్పారు. ప్రతి నోటీసును ఓటర్లకు తప్పనిసరిగా అందజేయాలి.
స్వయంగా పరిశీలించాలి..
ప్రతిస్పందనలను సేకరించి, వాటిని పట్టికలతో పాటు ఎరోలు స్వయంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. ఇది ఎరోలకు పెద్ద టాస్క్ అని అన్నారు. పోలింగ్ కేంద్రాలు ఖచ్చితంగా ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగాలని ఆదేశించారు. ప్రైవేటు భవనాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను వెంటనే ప్రభుత్వ భవనాలు లేదా కమ్యూనిటీ హాళ్లకు మార్చాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 1,200 మంది ఓటర్లను ప్రామాణికంగా తీసుకుని హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టాలని స్పష్టం చేశారు. ఏ మార్పులు లేదా సవరణలు చేసే ముందు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తప్పనిసరిగా తెలియజేయాలని హెచ్చరించారు.
ఎన్నికల అధికారి మను చౌదరి మాట్లాడుతూ..
జిల్లా ఎన్నికల అధికారి మను చౌదరి మాట్లాడుతూ… మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ అనే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన పూర్తి అర్బన్ జిల్లా అని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 24.60 లక్షలుగా ఉన్న జనాభా 2025 నాటికి 48 లక్షలకు చేరుకుంటుందని వివరించారు. ఎన్యుమరేషన్, డిజిటైజేషన్, అన్‌కలెక్టబుల్ ఫారమ్‌లతో కలిపి ప్రస్తుతం 85 శాతం పని పూర్తయిందని, మిగిలిన 15-16 శాతాన్ని రాబోయే ఒకటి-రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలుసెక్రటరీకిఅందజేశారు.
దూల్లపల్లిలో క్షేత్రస్థాయి పర్యటన..
అనంతరం ఈసీఐ సెక్రటరీ నవీన్ కుమార్ మేడ్చల్ నియోజకవర్గం తిమ్మాయిపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూల్లపల్లిలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. సర్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, బీఎల్‌ఓలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, నియోజకవర్గాల వారీగా ఎరోలు వెంకట్ రెడ్డి, సంచిత్ గంగ్వార్, పింకేష్ కుమార్, రాధికా గుప్తా, మయాంక్ సింగ్, ఆర్డీఓ మాలతి, ఏఈఆర్‌ఓలు, ఎరోలు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: యార్లగడ్డకు వల్లభనేని వంశీ లీగల్ నోటీసులు.. క్షమాపణ చెప్తావా? కోర్టుకు వస్తావా?