Big Stories

Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. నెక్ట్స్ ఏంటి..?

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడుగా ముందుకెళుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. గురువారం ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ తో కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చింది. రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. రామచంద్ర పిళ్లై తాను కవిత బినామీగా ఒప్పుకున్నారని ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

రామచంద్ర పిళ్లై, కవిత మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది. ఇప్పటికే రామచంద్ర పిళ్లైను ఈ నెల 13 వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో మరోసారి కవితతో కలిపి రామచంద్ర పిళ్లైను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. రామచంద్ర పిళ్లై సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించారని ఈడీ చెబుతోంది.

- Advertisement -

మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం పోరాటానికి సిద్ధమైయ్యారు. ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. అక్కడ దీక్ష చేపడతానని ప్రకటించారు. ఈ లోపే ఈడీ నుంచి నోటీసులు రావడం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈడీ నోటీసులు వస్తాయని ముందే ఊహించి వ్యూహాత్మకంగా ఢిల్లీ కేంద్రంగా రాజకీయ కార్యక్రమాలకు కవిత ప్లాన్ చేశారని విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 11 మందిని ఈడీ అరెస్టు చేసింది. అటు సీబీఐ కూడా ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసింది. తాజాగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన 14 రోజుల జ్యూడిషియల్ రిమాండులో ఉన్నారు. ఇలా ఈడీ, సీబీఐ ఈ కేసులో వేగంగా దర్యాప్తు చేస్తున్నాయి. కీలక వ్యక్తులను అరెస్టు చేస్తూ ముందుకెళుతున్నాయి. అయితే రాజకీయ కక్ష సాధింపుతోనే కేంద్రం ప్రతిపక్ష పార్టీల నేతలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గతేడాది డిసెంబర్‌ 11న కవితను హైదరాబాద్ లోని ఆమె ఇంటివద్దే సీబీఐ అధికారులు విచారించారు. దాదాపు ఏడున్నర గంటలపాటు వివిధ అంశాలపై  ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఈడీ కవితను ప్రశ్నిస్తుందా..? అరెస్టు చేస్తుందా..? బీఆర్ఎస్ ప్రతివ్యూహమేంటి..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News