MLC Elections: ఏపీ, తెలంగాణలో 27వ తేది గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఏపీలో ఉమ్మడి గుంటూరు – కృష్ణా, తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల, అలాగే ఉత్తరాంధ్ర నియోజకవర్గాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు, వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఎన్నికలు అధికార పార్టీలకు కీలకంగా మారాయి.
ఏపీలో కంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మెదక్ పట్టభద్రుల స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, మొత్తం 3,41,313 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే ఇదే నియోజకవర్గంలో టీచర్ల స్థానంలో 15 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 25,921 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, మొత్తం 24,905 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. ఎన్నికల పర్వం ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
ప్రలోభాలకు వేళాయెరా?
తెలంగాణలో ఒక పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ప్రలోభాల పర్వానికి పలువురు అభ్యర్థులు తెరతీసినట్లు ప్రచారం సాగుతోంది. హామీలు ఎన్ని గుప్పించినా, డబ్బులు పంచకపోతే ఓట్లు రావన్న అభిప్రాయంతో అభ్యర్థులు సైలెంట్ గా తమ పని తాము చేసుకోపోతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే కొందరు ఓటర్లు కూడా తెలివి మీరి, గ్రూపుల వారీగా అభ్యర్థులతో బేరసారాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ప్రధానంగా మెదక్ లో కొందరు ఓటర్లు ఇదే విషయంపై చర్చించుకుంటూ ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుండి కొమురయ్య, పీఆర్టియు నుండి మహేందర్ రెడ్డి, కోదండరాం మద్దతుతో అశోక్ కుమార్, ఇలా పలువురు అభ్యర్థులు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు ఉండడంతో ఓటర్లను ప్రలోభాలు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఒక్క ఓటుకు రూ. 5000 వరకు డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. పట్టభద్రులకు మాత్రం రూ. 3000 ఇచ్చేందుకు పలువురు అభ్యర్థులు రంగంలోకి దిగారట. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లో ఆత్మీయ సమావేశాల పేరుతో పార్టీలు కూడా నడుపుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్నికల అధికారులు ఆ దిశగా నిఘా వేశారట.
Also Read: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – కీలక విషయాలపై చర్చలు
ఒక ఉపాధ్యాయ అభ్యర్థి ఏకంగా మహిళా ఉపాధ్యాయులకు టూవీలర్ వాహనాలు ఇప్పించేందుకు ఏకంగా బాండ్ పేపర్ రాసినట్లు ప్రచారం ఊపందుకుంది. ఏది ఏమైనా ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసే చర్యలకు ఎండ్ కార్డు వేసేందుకు ఎన్నికల అధికారులు పూర్తి నిఘా ఉంచారు. ఇప్పటికే ఆయా అభ్యర్థులపై నిఘా ఉంచిన ఎన్నికల అధికారులు ఎక్కడైనా డబ్బులు పంచడం, పార్టీలు ఇవ్వడం వంటి అంశాలపై నిఘా వర్గాలతో సమాచారం తెలుసుకుంటున్నారట. పట్టభద్రులు, ఉపాధ్యాయులు అంటేనే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులుగా పరిగణింపబడతారు. ఇలాంటి సందర్భంలో ప్రలోభాల ప్రచారం సాగడం దురదృష్టకరమని పలువురు అభ్యర్థులు తెలుపుతున్నారు. ఓటర్లు ఓటును అమ్ముకోకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు, పలు రాజకీయ పార్టీలు సూచిస్తున్నాయి.