BigTV English

Revanth Reddy – PM Modi : ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – కీలక విషయాలపై చర్చలు

Revanth Reddy – PM Modi : ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – కీలక విషయాలపై చర్చలు

Revanth Reddy – PM Modi :


⦿ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి.
⦿ మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి.
⦿ రాష్ట్రానికి రీజిన‌ల్ రింగ్ రైల్‌, డ్రైపోర్ట్‌లు మంజూరు చేయండి
⦿ సెమీ కండ‌క్ట‌ర్ మిష‌న్‌కు అనుమ‌తించండి.
⦿ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ లో రాష్ట్రానికి కావాల్సిన కీలకమైన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు జరుగుతాయనుకున్నారు. కానీ.. ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు కల్పించకపోవడంతో.. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీని నేరుగా కలుసుకున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రం సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ అంశాలపై ప్రత్యేక వినతులు అందించిన రేవంత్ రెడ్డి.. నిధులు, అనుమతులు, కొత్త ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో చర్చించారు. దిల్లీలోని ప్ర‌ధాన‌ మంత్రి న‌రేంద్ర మోదీతో ఆయ‌న అధికారిక నివాసంలో సమావేశమైన సీఎం రేవంత్.. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.


రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మించ తలపెట్టిన రెండో దశ మెట్రో నిర్మాణం గురించి ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన అనుమతులు మంజూరు చేయడంలో కేంద్రం జాప్యం చేస్తుండడంతో.. ఆ విషయాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి త్వరితగతిన అనుమతులు వచ్చేలా చూడాలని కోరారు. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో మెట్రో రైలు సౌక‌ర్యం అన్ని ప్రాంతాల‌కు అందుబాటులోకి తీసురావడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌దేళ్లుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో విస్త‌ర‌ణ‌పై దృష్టి సారించ‌లేద‌ని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. ఫేజ్‌-II కింద రూ.24,269 కోట్ల అంచ‌నా వ్యయంతో 76.4 కి.మీ పొడ‌వైన అయిదు కారిడార్ల‌ను ప్ర‌తిపాదించినట్లు ప్రధాని మోదీకి వివరించారు.

రీజనల్ రింగ్ రైలు 

రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగంలో ఇప్ప‌టికే 90 శాతం భూ సేక‌ర‌ణ పూర్త‌యిందని.. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగాన్ని వెంట‌నే మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని కోరారు. ఉత్త‌ర భాగంతో పాటే ద‌క్షిణ భాగం పూర్త‌యితే ఆర్ఆర్ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగ‌ల‌మ‌న్నారు. ద‌క్షిణ భాగం భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో 50 శాతం భ‌రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

ఆర్ఆర్ఆర్‌కు స‌మాంత‌రంగా రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న ఉంద‌ని పీఎం మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివ‌రించారు. ఈ రీజిన‌ల్ రింగ్ రైలు పూర్త‌యితే తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని రైలు మార్గాల‌తో క‌నెక్ట‌విటీ సుల‌భ‌మ‌వుతుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు.. రీజిన‌ల్ రింగ్ రైలుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరారు. స‌ముద్ర మార్గం లేని తెలంగాణ‌కు వ‌స్తువుల ఎగుమ‌తులు, దిగుమ‌తులు సులువుగా చేసేందుకు రీజిన‌ల్ రింగు రోడ్డు స‌మీపంలో డ్రైపోర్ట్ అవ‌స‌ర‌మ‌ని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని స‌ముద్ర పోర్ట్ ల‌ను క‌లిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి విన్నవించారు.

మూసీ ప్రక్షాళనకు సహకారం

తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక‌త మూసీ న‌దితో ముడిప‌డి ఉంద‌ని… రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం మ‌ధ్య‌గా మూసీ ప్ర‌వ‌హిస్తోంద‌ని పీఎంకు వివరించారు. రాష్ట్రంతో అంతటి ప్రాధాన్యం ఉన్న మూసీ పున‌రుజ్జీవ‌నానికి స‌హ‌క‌రించాల‌ని ప్ర‌ధానిని కోరారు. ఈసా, మూసా న‌దుల సంగ‌మంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళ‌న‌కు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్‌, క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణం, మూసీ గోదావ‌రి న‌దుల అన‌సంధానంతో క‌లిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అంద‌జేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి వినతి పత్రాన్ని అందించారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎక‌రాల ర‌క్ష‌ణ భూముల బ‌దిలీకి స‌హ‌క‌రించాల‌ని పీఎంకు ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

ఐపీఎస్ పోస్టులు కావాలి

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌కు 61 ఐపీఎస్ కేడ‌ర్ పోస్టులు వ‌చ్చాయ‌ని, 2015లో రివ్యూ త‌ర్వాత మ‌రో 15 పోస్టులు అద‌నంగా వ‌చ్చాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్ కేసులు పెరగ‌డం, రాష్ట్రంలో పెరిగిన ప‌ట్ట‌ణాలు, ఇత‌ర అవ‌స‌రాల దృష్ట్యా తెలంగాణ‌కు అద‌నంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాల‌ని పీఎం మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సెమీ కండ‌క్ట‌ర్ల ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు అనువైన ప‌రిస్థితులు తెలంగాణ‌లో ఉన్నందున ఇండియా సెమీ కండ‌క్ట‌ర్ మిష‌న్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అన‌మ‌తించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×