Endowment department : గుడిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు వివిధ దర్శనాలు, సేవలు పేరుతో ఆలయాల్లో డబ్బులు వసూళ్లు చేస్తుంటారు. ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ ద్వారా ఏటా వందలు, వేల కోట్లను ఆలయాల నుంచి రాబడుతుంటుంది. అయితే.. చాలా ఆలయాల్లో ఆఫ్ల లైన్లో టికెట్లు జారీ చేస్తుండడం, నగదు గానే చెల్లింపులు చెపడుతుండడంతో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం.. ఆలయాల టికెట్ల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని దేవాదాయ శాఖ పరిధిలోని గుడుల్లో ఆన్ లైన్ ద్వారానే టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు.
ఆన్ లైన్ ద్వారా అయితే భక్తులు సమర్పించే కానుకలు, సేవా రుసుములు సహా వివిధ పూజలకు సమర్పించే సొమ్ముల లెక్కలకు సరైన లెక్కలు ఉంటాయని భావిస్తున్నారు. అందుకే.. అన్ని ఆలయాల్లో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారుల్ని ఆదేశించారు. దేవాలయాల నిధులు సరైన విధానంలో వినియోగం కావాలన్న ఉద్దేశంతో ఆన్లైన్ టికెట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఆన్లైన్ టికెట్ వ్యవస్థ ద్వారా.. భక్తులు తమ విశేష దర్శనాలు, ప్రత్యేక దర్శనం, ఇతర సేవల కోసం ముందుగా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ విధానం ద్వారా నిధుల జమ, ఖర్చుల వివరాలు పారదర్శకంగా ట్రాకింగ్ చేసేందుకు వీలవుతుంది. దీంతో, అన్ని నిధులు దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతాయని మంత్రి వ్యాఖ్యానించారు. తాజా నిర్ణయంతో.. ఇకపై ఆలయానికి కంగారుగా పరుగులు పెట్టి టికెట్లు తీసుకునే అవసరం లేకుండా.. ముందుగానే అందుబాటులోని టికెట్లు, కావాల్సినన్ని పొందేందుకు వీలవుతుంది.
దేవాదాయ శాఖ అధికారులు ఈ టికెట్ వ్యవస్థని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే అన్ని ఆలయాల్లో అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ, యాదగిరి గుట్ట, భద్రాచలం, జోగులాంబ వంటి ప్రముఖ పుణ్య క్షేత్రాలతో పాటు అనేక ఇతర క్షేత్రాలు ఈ శాఖ పరిధిలో ఉన్నాయి. ఈ దేవాలయాల్లో పూజలు, ప్రత్యేక దర్శనాలు, ఇతర సేవలు రోజూ నిర్వహిస్తూ ఉంటారు. ఈ సేవల ద్వారా ఆలయాలకు భారీ ఎత్తున ఆర్థిక వనరులు సమకూరుతుంటాయి. ఈ ఆదాయంలో ప్రధానంగా టికెట్ విక్రయాలు, దానాల ద్వారా వచ్చే ఆదాయం, హుండీ సొమ్ములు, ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక పూజా సేవలు ఉంటాయి.
Also Read : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షాకాజ్ నోటీసులు
ఈ ఆదాయాన్ని ప్రధానంగా ఆలయ అభివృద్ధి, పూజా కార్యక్రమాల నిర్వహణ, సంవత్సరాంత వేడుకలు, ఆలయ భవనాల మరమ్మతులు వంటి వాటికి వినియోగిస్తారు. ఈ ఆదాయాన్ని పారదర్శకంగా అమలు చేయాలని, ప్రముఖ ఆలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆన్లైన్ టికెట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ.. ఈ ఆదాయాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా వినియోగించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది.