Theenmar Mallanna: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న తీన్మార్ మల్లన్నపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసేకుంది. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కులగణన ఫామ్‌పై నిప్పు పెట్టడం పట్ల కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది.
ఇటీవల బీసీ కులగణన, ఇతర సామాజిక అంశాలపై తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీ నేతల అసంతృప్తికి కారణమయ్యాయి. కాంగ్రెస్‌లోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ పరువు దెబ్బతీసేలా మల్లన్న వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ హైకమాండ్‌ను పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఆయనపై అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు అధిష్టానానికి ఫిర్యాదులు అందించినట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి తీన్మార్ మల్లన్న భవిష్యత్తు ఏ దిశగా మలుపు తిరుగుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఏకు మేకు అవ్వడం కాదు.. ఏకంగా బల్లెంలా తయారైందంట.. సరిగ్గా కాంగ్రెస్‌లో ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం అలాగే తయారైందని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. జర్నలిస్ట్గుగా కెరీర్ ప్రారంభించి కాంగ్రెస్ చొరవతో ఎమ్మెల్సీగా ఎన్నికైన మల్లన్న కాంగ్రెస్ ముఖ్యనేతలపై విమర్శలు గుప్పిస్తుండటం.. పదేపదే వాటిని రిపీట్ చేస్తుండటంపై కాంగ్రెస్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. తాజాగా బీసీల రాజకీయ యుద్దభేరి అంటూ హడావుడి చేసిన ఆయన రేవంత్ రెడ్డే తెలంగాణకు ఆఖరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించడం.. మల్లన్న తనను తాను సీఎం క్యాండెట్‌గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేయడం మరింత వివాదాస్పదంగా తయారైంది. ఇదే గాక, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులవర్గీకరణ ఫామ్‌కు నిప్పుపెట్టడం.. తదితర కారణాల వల్లే తెలంగాణ క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసుకుంది.
తీన్మార్ మల్లన్నపై పీసీసీ చీఫ్‌కు నేతల నుంచి భారీగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఇటీవల మల్లన్న బీసీ కులగణనతోపాటు పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్నగా పొలిటికల్ సర్కిల్స్‌లో పాపులర్ అవుతూ.. జెఎన్‌టీయూ నుంచి ఎంబీఏ పట్టభద్రుడైన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే చేస్తున్న కొలువు మానేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2015లో వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తొలిసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఇక దొరికిందే అవకాశంగా గజనీ మహమ్మద్‌లా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019లో కాంగ్రెస్ సీనియర్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలిచి హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. అప్పుడు హుజూర్‌నగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న పరోక్షంగా బీఆర్ఎస్ విజయానికి సహకరించారన్న ప్రచారం జరిగింది. తర్వాత రెండో సారి వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఎప్పటిలాగే మళ్లీ ఓడిపోయారు. ఇండిపెండెంట్‌గా మల్లన్న 83,520 ఓట్లు చీల్చుకోవడంతో, బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓట్లతో 12,806 ఓట్లతో గెలిపొందారు.
Also Read: Mandakrishna Madiga: మాదిగలకు మోసం.. అసలు ఇలా వర్గీకరణ చేస్తారా..?: మందకృష్ణ సంచలన వ్యాఖ్యలు
తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపీ సెంట్రల్ ఆఫీసులో కాషాయ కండువా కప్పుకుని కొన్నిరోజులు హడావుడి చేశారు. మళ్లీ ఏమనుకున్నారో ఏమో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ పంచకే చేరారు. అప్పటికే ఎన్నికల్లో మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయిన మల్లన్నకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఖాళీ అయిన వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన బైపోల్స్‌లో కాంగ్రెస్ క్యాండెట్‌గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఎట్టకేలకు చట్టసభలో అడుగుపెట్టగలిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న వ్యవహారిశైలి ఇలానే ఉంటే మున్ముందు ఆయనపై తెలంగాణ కాంగ్రెస్ మరిన్ని కఠిన చర్యలు తీసుకునే చర్యలు లేకపోలేవు.