Caste Census :
⦿ ఓవైపు కులగణనను స్వాగతిస్తూనే ఇంకోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు
⦿ ఎన్యుమరేటర్లను నిలదీయాలంటున్న కేటీఆర్
⦿ అదే స్ఫూర్తితో వీడియోలు తీస్తున్న కొందరు
⦿ ఇబ్బంది పడుతున్న ఎన్యుమరేటర్లు
⦿ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై ఆగ్రహ జ్వాలలు
⦿ తప్పు చేస్తున్నారంటూ కాంగ్రెస్ వర్గీయుల కౌంటర్
హైదరాబాద్, స్వేచ్ఛ: సామాజిక న్యాయం జరగాలంటే దేశమంతా కులగణన జరగాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈలోపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే, కులగణన అంశంలో తెలంగాణ ముందుంది. దీనికోసం విధివిధానాలు రూపొందించి ఇంటింటి సర్వే కూడా మొదలుపెట్టింది. కానీ, కులగణన అంశంలో బీఆర్ఎస్ తీరు విమర్శల పాలవుతోంది.
రెచ్చగొడుతున్న కేటీఆర్
మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కులగణన మొదలు పెట్టింది. సమగ్ర కుటుంబ సర్వే అంటూ ఇంటింటికీ ఎమ్యునరేటర్లను పంపుతోంది. మొదటి మూడు రోజులు స్టిక్కరింగ్ పనులు పూర్తవ్వగా, రెండు రోజులుగా వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. విద్య, ఆర్థిక, ఉద్యోగ, సామాజిక అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే, ఈ సర్వేను ఓవైపు స్వాగతిస్తూనే ఇంకోవైపు కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సర్వే ఎందుకు చేస్తున్నావ్, మా పథకాలు కట్ చేసినందుకా అంటూ వచ్చిన వాళ్లను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉందని, మీ ఇంటికొచ్చిన వారిని వివరాలు ఇస్తా.. కానీ, హామీలు ఏమయ్యాయని నిలదీయాలని అన్నారు.
సోషల్ మీడియాలో వీడియోలతో దుష్ప్రచారం
కులగణనలో ఉన్న ప్రశ్నల విషయంలో అనేక వ్యతిరేక ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా దీన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తోంది. కొందరైతే కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో ఎమ్యునరేటర్లను నిలదీస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత అంటూ వైరల్ చేస్తున్నారు. నిజానికి కులగణన రూల్స్‌ను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరికి చెప్పడం ఇష్టం లేకపోయినా దానికో కాలమ్‌ను కూడా నిర్దేశించింది. కానీ, కొందరు అత్యుత్సాహం చూపిస్తూ, ఎన్యుమరేటర్లను ఇబ్బంది పెడుతున్నారు.
ఎన్యుమరేటర్ల వీడియోలు
సర్వే కోసం వస్తున్న వాళ్లు నాయకులో, కార్యకర్తలో కాదు. సాధారణ ఉద్యోగులు, వాలంటీర్లు. వాళ్లు విధి నిర్వహణలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వివరాలు సేకరించడానికి వస్తారు. అలాంటి వాళ్ల ఫోటోలు, వీడియోలు తీసే అధికారం ఎవరికీ లేదు. మీకు అంతగా డౌట్స్ ఉంటే ప్రశ్నిస్తూ, మీరే స్వయంగా వీడియోలు చేయొచ్చు. కులగణన పట్ల ఆసక్తి లేకుంటే లేదని చెప్పొచ్చు. అలా కాకుండా ఎన్యుమరేటర్ల వీడియోలు తీసి, విధి నిర్వహణలో ఉన్న వారిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా, వీడియోలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేయడం నేరంగా చెబుతున్నారు. ఇతరుల ప్రైవసీకి ఆటంకం కలిగించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించడం కూడా తప్పని అంటున్నారు.