⦿ అనుమతులు మీవే.. ఓనర్లు మీ వాళ్లే!
⦿ తడిగుడ్డతో గొంతు కోసి కుట్రలా?
⦿ జనాన్ని రెచ్చగొట్టే పనిలో బీఆర్ఎస్ పార్టీ
⦿ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్రలు
⦿ దిలావర్‌పూర్ అసలు నిజాలు ఇవే!
⦿ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు
⦿ తలసాని ఫ్యామిలీ, బంధువులే ఓనర్లు
⦿ ఆనాడు 4 గ్రామాల ప్రజల చేత బలవంతంగా 60 ఎకరాల భూసేకరణ
⦿ నీళ్లు, కరెంట్, పొల్యూషన్, పర్యావరణం.. అన్ని పర్మిషన్లు చకచకా
⦿ ఇవ్వాల్సిన అనుమతులన్నీ ఇచ్చి ఇప్పుడు నాటకాలు
⦿ ప్రభుత్వంపై వ్యతిరేకత అంటూ రెచ్చగొట్టే కుట్రలు
⦿ తరిమికొట్టే రోజులంటూ తప్పుడు పోస్టులు
⦿ ప్రభుత్వంపై జనం తిరగబడుతున్నారని ఫేక్ న్యూస్‌లు
⦿ చేయాల్సిందంతా చేసి తప్పించుకునే ధోరణి
⦿ ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పాపమే!
⦿ కేసీఆర్ సర్కార్ అనుమతుల రద్దుకై ప్రభుత్వ ఆలోచన!
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: Congress on Ethanol Factory: లగచర్ల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్‌పై దాడికి పాల్పడడం జాతీయస్థాయిలో చర్చకు దారి తీసింది. ఇందులో బీఆర్ఎస్ కుట్ర ఉందని పోలీసులు తేల్చారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఏ1గా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. అయితే, ఇదే తీరుగా నిర్మల్ నియోజకవర్గం దిలావర్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, స్థానిక ప్రజలు రోడ్డెక్కారు.
చాలా రోజులుగా ఈ నిరసనలు జరుగుతున్నా, రెండు రోజులుగా తీవ్రతరం అయ్యాయి. నిర్మల్ ఆర్డీవో కారుపై దాడికి ప్రయత్నించారు స్థానికులు. అలాగే, పోలీసులపైనా దాడులకు తెగబడ్డారు. అయితే, చేయాల్సిందంతా చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఉసిగొల్పేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. నిజానికి దిలావర్‌పూర్‌లో తిరగబడింది బీఆర్ఎస్‌పైనే అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ, అసలేం జరిగింది.
కేసీఆర్ ప్రభుత్వంలో అనుమతులు
నిర్మల్ జిల్లాలో ఉంటుంది దిలావర్‌పూర్. గోదావరి నదిపై ఉన్న శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు కూతవేటు దూరంలో ఉంటుంది. ప్రాజెక్ట్ ఎగువన ఉండే దిలావర్‌పూర్, గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు బీఆర్ఎస్ హయాంలో 2022 ఏప్రిల్‌లో మంజూరు చేసుకుంటే 2023 ఏప్రిల్‌లో అనుమతులు వచ్చాయి. దీన్ని విత్తనాల ఫ్యాక్టరీగా ప్రచారం చేసి భూసేకరణ చేశారన్న ఆరోపణలున్నాయి. ఆ సమయంలో 4 గ్రామాల ప్రజల నుంచి 60 ఎకరాల దాకా భూములు తీసుకున్నారు. ఈ ల్యాండ్ పూలింగ్ అంతా భయపెట్టి, తక్కువ ధరకు తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీని వెనుక అప్పటి మంత్రి కీలకంగా వ్యవహరించారని, అన్నీ దగ్గరుండి అనుమతులు వచ్చేలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూములు ఇవ్వని వారిని భయపెట్టడం, అరెస్టులు చేయడం వంటివి జరిగాయని బాధితులు చెబుతుంటారు.
ప్రభుత్వం మారడంతో న్యాయం కోసం ప్రజల పోరాటం
పదేళ్లు పాలించిన కేసీఆర్‌ను ఇక చాలు అంటూ 2023 ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ప్రజల్లో ధైర్యం పెరిగింది. ఇథనాల్ ఫ్యాక్టరీ తమ భూముల్లో వద్దంటూ నిరసనకు దిగారు ప్రజలు. చాలా రోజులుగా నాలుగు గ్రామాల ప్రజలు ఏకమై, ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ ధర్నాలు చేస్తున్నారు. రద్దు చేసేంతవరకు తమ పోరాటం ఆగదని ప్రతిన బూనారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమ పంట పొలాలతో పాటు పర్యావరణం సైతం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు వారితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. నిర్మల్ ఆర్డీవో గ్రామానికి వెళ్లగా కొందరు రెచ్చిపోయారు. కారుపై దాడికి ప్రయత్నించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారిపై కూడా దాడికి పాల్పడడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ప్రభుత్వ సానుకూల ప్రకటన
ప్రజల నిరసనలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. ఇథనాల్ ఫ్యాక్టరీపై పునరాలోచిస్తామని ప్రకటించింది. గ్రామస్తులపై జిల్లా కలెక్టర్ అభిలాష మాట్లాడారు. ఫ్యాక్టరీ పనులు నిలిపివేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నట్టు చెప్పారు.
కంపెనీకి డైరెక్టర్‌గా బీఆర్ఎస్ నేత తలసాని సాయి కిరణ్
వివాదాస్పదమైన ఈ ఇథనాల్ కంపెనీకి సంబంధించి సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి. గతంలో ఫ్యాక్టరీకి అనుమతులు పొందింది పీఎంకే డిస్టిలేషన్స్ లిమిటెడ్. ఈ కంపెనీకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అనుమతులు పొందే సమయంలో ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనతోపాటు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. రూ.222.80 కోట్ల వ్యయంతో నిర్మల్ జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
అయితే, ఏ పరిశ్రమో చెప్పకుండా భూములు తీసుకున్నారనేది రైతుల వాదన. ఈ ఫ్యాక్టరీ వల్ల ఎస్‌ఆర్ఎస్‌పీ బ్యాక్ వాటర్ కలుషితం అవుతుందని పర్యావరణవేత్తలు కూడా చెబుతున్నారు. నారాయణ పేట జిల్లాలో ఇలాగే ఇథనాల్ ఫ్యాక్టరీ అని చెప్పకుండా పండ్ల రసాల ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. తర్వాత ఇథనాల్ ఉత్పత్తి మొదలుపెట్టారు. దీని వల్ల విష రసాయనాలు మన్నె వాగులో కలిశాయి. వాగు కులషితమైంది. ఆ నీళ్లు తాగిన పశువులు, వన్యప్రాణులు చనిపోయాయి. ఇథనాల్ వల్ల మానవాళికి ముప్పు. శరీరాన్ని నియంత్రించే మెదడు పని తీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రైతుల ధర్నాపై గులాబీ రాజకీయం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏదో ఒక రకంగా బద్నాం చేయాలనేది బీఆర్ఎస్ ప్లాన్‌గా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. లగచర్ల ఘటనలో చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలోనూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైరవుతున్నారు. ఇవ్వాల్సిన అనుమతులన్నీ ఇచ్చి, గులాబీ నేతలకు లబ్ధి చేకూరేలా చేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం తిరగబడుతున్నారు అంటూ కుట్రలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు.
Also Read: TN Rains Effect AP: ఏపీకి తమిళనాడు పరిస్థితేనా? వామ్మో జాగ్రత్త.. ఇప్పటికే అక్కడ అన్నీ బంద్
ఇదే సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌పై మండిపడుతున్నారు. గతంలో బీఎస్పీలో ఉన్నప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా, కేసీఆర్, కేటీఆర్, కవిత ఫాంహౌస్‌లలో ఏర్పాటు చేయాలని తిట్టిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం ఏంటని నిలదీస్తున్నారు. దీనిపై సామ రామ్మోహన్ మాట్లాడుతూ, బీఆర్ఎస్‌లో చేరి అబద్ధాల ప్రవీణ్‌గా మారారని, నిర్మల్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ కుటుంబానికి చెందిన పీఎంకే డిస్టిలేషన్స్ కంపెనీ అని, వాస్తవాలు మరచిపోయి, ఫాంహౌస్ నుండి వచ్చిన అసత్యాలను ట్వీట్ చేస్తూ రోజురోజుకూ దిగజారిపోవద్దని హితవు పలికారు.