By Election : సర్వం సిద్ధం
మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఈ నియోజకవర్గంలో 2 లక్షల 41 వేల 855 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 50 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 80 ఏళ్లు దాటిన ఓటర్లు 2,576 మంది ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 5,686 మంది ఉన్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ కోసం 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని సీఈవో తెలిపారు. నవంబర్ 1 సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్ జరుగుతుంది.
By Election : పక్కాగా ఏర్పాట్లు
మునుగోడు ఉపఎన్నిక కోసం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అర్బన్ పరిధిలో 35, రూరల్ పరిధిలో 263 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి కొత్త ఓటరు గుర్తింపు కార్డులను మంజూరు చేశారు. ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశారు. ఓటర్ స్లిప్పులు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. మాక్‌పోలింగ్ కోసం గంట ముందుగానే పోలింగ్ ఏజెంట్లు రావాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు ఆఫీసర్లు ఉంటారు. పోలింగ్ కోసం మొత్తం 3366 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 300 మంది సిబ్బందిని అదనంగా అందుబాటులో ఉంచుతున్నారు. 199 మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్‌లెవెల్ ఆఫీసర్లు ఉంటారు.
By Election : సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టులు
మునుగోడు పరిధిలో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రూ. 6.80 కోట్ల నగదు, 4,560 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 111 మద్యం బెల్ట్ షాపులను సీజ్ చేశారు. 185 కేసులు నమోదు చేశారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం సీవిజల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. నేరుగా పోలింగ్ కేంద్రం నుంచే ప్రతిగంటకు ఓటింగ్ శాతం నమోదు చేస్తారు. నవంబర్ 1 సాయంత్రం 6 గంటల తర్వాత మునుగోడులో విస్తృత తనిఖీలు చేపడతామని సీఈవో తెలిపారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు నియోజకవర్గంలో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎస్‌ఎంఎస్‌లపైనా నిషేధం విధించారు. దీనికి అనుగుణంగా నెట్‌వర్క్ ప్రొవైడర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నియమ, నింబంధనలను కచ్చితంగా పాటించి పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈసీ జారీ చేసిన నోటీసుపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి వివరణ అందిందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపామన్నారు.