Fake Eye Hospital: ఆయా కంటి డాక్టర్ల దగ్గర చేసిన అనుభవం(డిప్లమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్) సర్టిఫికెట్లను అడ్డుపెట్టుకొని ఆప్తాల్మిక్ వైద్యులుగా ప్రచారం చేసుకుంటూ అర్హతకు మించి కంటి ఆపరేషన్లు, ఇతర వైద్యాన్ని అందించిన ఫేక్ కంటి డాక్టర్ల వ్యవహారం బట్టబయలైంది. మిర్యాలగూడ వన్ టౌన్ లో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు ఫేక్ కంటి డాక్టర్లపై నమోదైన కేసు వివరాలను వెల్లడించారు. ఇటీవల నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీఎంసీ) ఆఫీసర్ల బృందం తనిఖీలు చేపట్టి నకిలీ కంటి వైద్య వ్యవహారాన్ని గుర్తించినట్లు చెప్పారు.
వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన పజ్జురి వికాస్ కుమార్ డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు. అనంతరం సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 2007 నుంచి 2009 వరకు ( డిప్లమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్) డీవోఏ కోర్స్ కంప్లీట్ చేశాడు. హైదరాబాద్ లో ట్రాన్స్ ఐ, శ్రీ నేత్రాలయలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్ గా ఐదేళ్లు, అదేవిధంగా మిర్యాలగూడ హనుమాన్ ఐ క్లినిక్ లో ఆరేళ్లు పనిచేశాడు. ఈ క్రమంలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్ గా పనిచేసేది వదిలేసి 2021లో మిర్యాలగూడలో శ్రీ మహాలక్ష్మీ కంటి ఆస్పత్రిని స్థాపించి నాటి నుంచి ఆఫ్తాల్మిక్ డాక్టర్ గా పేషంట్లను పరిచయం చేసుకుంటూ చికిత్సను చేస్తున్నాడు. ఆయన ప్రారంభించిన శ్రీ మహాలక్ష్మీ కంటి ఆస్పత్రిలో (స్పెషలిస్ట్ ఆఫ్తాల్మిక్ కన్సల్టెంట్ )నియమించి అతని పేరిట ప్రిస్క్రిప్షన్ పేపర్లను ప్రింట్ చేయించారు. ఆ స్పెషలిస్ట్ కంటి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా నమ్మించారు.
ఈ నేపథ్యంలో గత ఏడాది జూన్ 8న కంటి సమస్యపై బైరెడ్డి పద్మ అనే మహిళ ఆస్పత్రికి వచ్చింది. కుడి కన్నును పరీక్షించి కంటిలో చుక్క ఉందని సర్జరీ చేయాలని నిర్ణయించిన వికాస్ కుమార్ డాక్టర్ ను పిలిపించి టెస్టులు కంప్లీట్ అయ్యాయని సర్జరీ కచ్చితంగా చేయాలని సూచిస్తూ అదేరోజు మధ్యాహ్నం సర్జరీ చేయించాడు. సర్జరీ అనంతరం మరుసటి రోజు తన కుడి కన్ను పూర్తిగా కనిపించట్లేదని ఆ మహిళ చెప్పగా వికాస్ కుమార్ స్పెషలిస్ట్ కంటి డాక్టర్ కు చెప్పకుండా అతని ప్రిస్క్రిప్షన్ పై కొన్ని మందులు రాసి ఇచ్చాడు. ఫలితంగా ఆ మహిళ కంటి చూపు పూర్తిగా మందగించింది.
ఈ తరహాలో అర్హత లేకుండా నకిలీ వైద్యాన్ని అందించిన తీరుపై, అదేవిధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో గల శ్రీ మహాలక్ష్మీ,, శాలిని, యశస్వి, అన్నపూర్ణ, రాఫా కంటి ఆస్పత్రులను తనిఖీ చేసి వారు ఆప్తాల్మిక్ డాక్టర్లు కాదని వారికి ఆధునిక వైద్యం, నేత్ర వైద్యం చేసే అర్హత లేదని ఆప్తాల్మిక్ డాక్టర్లుగా చెప్పుకుంటూ చలామణిలో ఉన్న వల్కి శ్రీను, పెమ్మి వెంకటేష్, బాణావత్ శివ కోటేశ్వర్ రావు, పజ్జురి వికాస్ కుమార్, గడ్డం నాగరాజుల పై చేసిన పట్టణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల చేసిన మేరకు విచారణ చేపట్టి ఆరుగురిలో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ లు సోమ నర్సయ్య, నాగభూషణం, ఎస్సై సైదిరెడ్డి ఉన్నారు.
Also Read: Jaggareddy: జగ్గారెడ్డి మార్క్ రాజకీయం.. ఢిల్లీలో ఖర్గేతో భేటీ.. ఆ ఇద్దరి కోసమేనా?