Mulugu District: బిగ్‌టీవీ సీడ్ బాంబ్ కథనాలకు రియాక్షన్ వచ్చింది. ములుగు జిల్లాలో ముసుగు దందాలకు చెక్ పడింది. జన్యు మార్పిడి విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు రిలీఫ్ దక్కబోతోంది. జన్యుమార్పిడి మొక్కజొన్న విత్తనాలు నాటి తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు విత్తన కంపెనీలు ముందుకొచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలతో రైతులకు ప్రయోజన జరగబోతోంది.
జన్యుమార్పిడి మొక్కజొన్న విత్తనాలతో నష్టం
ములుగు జిల్లాలో జీఎం మొక్కజొన్న క్రాప్ చుట్టూ పెద్ద కథే నడిచింది. రైతుల్ని బుట్టలో వేసుకుని జన్యుమార్పిడి విత్తనాలు నాటించడం, అవి కాస్తా దిగుబడులు రాకపోవడం, పెట్టుబడి ఖర్చులు నష్టపోవడం ఇవన్నీ జరిగాయి. చెప్పాలంటే ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపురం, వాజేడు మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయారు కూడా. వీటిపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. రైతులకు ఎలా నష్టం జరిగిందో కళ్లకు కట్టేలా వివరించింది.
పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్న కంపెనీలు
దీంతో ప్రభుత్వం ఈ విషయంలో ఎంటర్ అయింది. వ్యవసాయ కమిషన్ కూడా పర్యటించింది. ములుగు కలెక్టర్ దర్యాప్తు చేశారు. జన్యుమార్పిడి విత్తనాల వల్లే నష్టం వాటిల్లిందని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. అలాగే.. ఈ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలను కూడా గుర్తించారు. కంపెనీలే బాధ్యత వహించాలని ఆదేశించారు. చాలా చర్చలు జరిగాయి. చివరికి పరిహారం ఇచ్చేందుకు కంపెనీలు ఒప్పుకున్నాయి.
ములుగు జిల్లాలో 2వేల ఎకరాల్లో జీఎం మొక్కజొన్న
ములుగు, వెంకటాపురం, వాజేడు మండలాలలో రైతులను మోసం చేసి కంపెనీలు మొక్కజొన్న సాగు చేయించాయి కంపెనీలు. 2వేల ఎకరాల్లో పంటలు వేశారు. నాలుగు కంపెనీలు విత్తనాలు సరఫరా చేసినట్లు గుర్తించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు విత్తన కంపెనీలు ఒప్పుకున్నాయి. నష్టాన్ని బట్టి ఎకరానికి 15 వేల నుంచి 85 వేల వరకూ పరిహారం అందుతుందంటున్నారు. పది రోజుల్లో బాధిత రైతులకు పరిహారం చెక్కులు ఇస్తారంటున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో సీడ్ కంపెనీలతో జిల్లా కలెక్టర్ చర్చలు
ఈ మొత్తం వ్యవహారంలో గిరిజన రైతుల పోరాటాన్ని ప్రభుత్వ దృష్టికి బిగ్ టీవీ తీసుకెళ్లింది. వరుస కథనాలతో ఏజెన్సీలో సీడ్ కంపెనీల బాగోతాన్ని బయటపెట్టింది. బిగ్ టీవీ కథనాలతో రైతు సంక్షేమ కమిషన్, వ్యవసాయ శాఖ అధికారులు కదిలారు. ప్రభుత్వ ఆదేశాలతో సీడ్ కంపెనీలతో జిల్లా కలెక్టర్ చర్చలు జరిపారు. మొత్తంగా 950 మంది నష్టపోయిన రైతులకు పరిహారం దక్కబోతోంది.
ఒక్కో రైతుకు రూ.50 వేల – 2 లక్షల దాకా నష్టం
ఈ మొక్కజొన్న పంటలు నష్టపోవడంతో ములుగు రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. GM మొక్కజొన్న విత్తనాలతో ఏదో అవుతుందనుకుంటే ఇంకేదో అయింది. ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. పంటలు సరిగా పెరగకపోవడం, దిగుబడి చాలా తగ్గడం వల్ల రైతులు లక్షల రూపాయలు నష్టపోయారు. ముఖ్యంగా వాణిజ్య పంటలపై ఆధారపడే రైతులకు గట్టి దెబ్బ తగిలినట్లైంది. ఒక్కో రైతుకు సగటున 50 వేల నుంచి 2 లక్షల దాకా నష్టం జరిగినట్లు అంచనాలున్నాయి. ఎకరాలను బట్టి ఈ నష్టం ఉందంటున్నారు. ఈ GM పంటల సాగు కోసం చాలా మంది రైతులు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం అప్పులు చేశారు. పంట నష్టాలతో ఈ అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు రోడ్డెక్కారు. సీడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, తక్షణ నష్టపరిహారం అందించాలని అప్పట్లో రైతులు డిమాండ్ చేశారు. కొందరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేశారు.
నష్టపరిహారం చెల్లించేందుకు కమిటీల ఏర్పాటు
ములుగు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఈ సమస్యపై దర్యాప్తు చేసి, GM మొక్కజొన్న విత్తనాలు క్వాలిటీ లేకపోవడం వల్లే పంట నష్టానికి కారణమని నిర్ధారించారు. సంబంధిత సీడ్ కంపెనీలు ప్రతి రైతుకు నష్టం ఆధారంగా పరిహారం చెల్లించాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కమిటీలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విత్తనాల క్వాలిటీ, సర్టిఫికేషన్, సప్లై చైన్ పై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోంది. కొన్ని కంపెనీలు నకిలీ లేదంటే క్వాలిటీ లేని విత్తనాలను సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుంది. జిల్లా అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి సమావేశమై రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
సీడ్ క్వాలిటీ కంట్రోల్ పై మరింత కఠినంగా ఫోకస్
నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ లు నష్టం అంచనా వేసి, పరిహారం పంపిణీని పర్యవేక్షిస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రిపీట్ కాకుండా సీడ్ క్వాలిటీ కంట్రోల్ పై కఠినంగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఇలా ఉంటే.. కొన్ని సీడ్ కంపెనీలు మరోలా రియాక్ట్ అవుతున్నాయి. తమ విత్తనాల క్వాలిటీ సమస్య లేదని, వాతావరణ పరిస్థితులు లేదంటే సరైన సాగు పద్ధతులు పాటించకపోవడం వల్లే పంట నష్టం జరిగి ఉండవచ్చని వాదిస్తున్నాయి. అయితే రైతులు, అధికారులు ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు. సీడ్ క్వాలిటే ముఖ్యమంటున్నారు. పరిహారం చెల్లించే విషయంలో కొన్ని కంపెనీలు సహకరిస్తుండగా, మరికొన్ని లీగల్ గా ప్రొసీడ్ అయ్యే ప్లాన్ తో ఉన్నాయంటున్నారు.
సీడ్ క్వాలిటే ముఖ్యమంటున్న రైతులు, రైతు సంఘాలు
తాము విత్తనాల కోసం అప్పు చేసి, ఎరువులు, కూలీల కోసం ఖర్చు పెట్టామని, పంట రాలేదని, అప్పు తీర్చలేకపోయామంటున్నారు రైతులు. సో ఈ వ్యవహారంలో రైతులకు వీలైనంత త్వరగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు ఆఫీసర్లు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యం చేసే సీడ్ కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. GM విత్తనాల సరఫరా, క్వాలిటీ కంట్రోల్ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తంగా ప్రభుత్వం వేగంగా రియాక్ట్ అవడం, అధికారులు చొరవ తీసుకోవడం, విత్తన కంపెనీలతో సంప్రదింపులు జరపడంతో అంతిమంగా రైతులకు మేలు జరగబోతోంది. పరిహారం త్వరగా వస్తే నష్టాల నుంచి కొంతలో కొంతైనా రిలీఫ్ దొరుకుతుంది.
బిగ్ టీవీ వరుస కథనాలు, ప్రభుత్వ చర్యలతో
జన్యుమార్పిడి ఆహార పంటలు పర్యావరణానికి చాలా డేంజర్. ఎందుకంటే అది పర్యావరణంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో ఊహించడం కష్టం. సంప్రదాయ మొక్కలకు సమస్య. కానీ మారుమూల ప్రాంతాల్లో విత్తనోత్పత్తి కోసమంటూ రహస్యంగా ప్రయోగాలు చేస్తుండడం ములుగు ఘటనతో మరోసారి చర్చనీయాంశమైంది. రైతులు నష్టపోయారు. సీడ్ ఆర్గనైజర్స్ అడ్రస్ లేకుండా పోయారు. బిగ్ టీవీ వరుస కథనాలు, ప్రభుత్వ చర్యలతో ఇన్నాళ్లకు రైతులకు న్యాయం జరగబోతోంది.
రైతులను నమ్మించి పంటలు వేయించిన పరిస్థితి
ఈ మొక్కజొన్న పొత్తుల్ని చూడండి.. ఇది సీడ్స్ ఉత్పత్తి కోసమంటూ ఏజెన్సీ ఏరియాల్లో పండించిన పంట. సీడ్స్ కోసం పత్తి అయినా మరొకటైనా రైతులతో ఒప్పందాలు చేసుకుని పండించడం ఒకెత్తు. కానీ ములుగు జిల్లాలో మాత్రం ఇవేవీ లేవు. అంతా సీక్రెట్. సీడ్స్ తేవడం, స్థానిక రైతులకు పండించాలని చెప్పడం, పంట మొత్తం కొంటామని నమ్మించడం ఇదే జరిగింది. దిగుబడి రాకపోవడం, రైతులు రోడ్డెక్కడంతో ఈ మ్యాటర్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. దీంతో కార్న్ సీడ్స్ చుట్టూ డార్క్ సీక్రెట్స్ అన్నీ ఒక్కొక్కటిగా బయటికొచ్చాయి. చెప్పాలంటే ఈ ఘటన మార్చిలో సంచలనం సృష్టించింది కూడా.
సీడ్స్ కోసమే పండిస్తే అనుమతులు, అగ్రిమెంట్లు అవసరం
గద్వాల్, ఉమ్మడి మహబూబ్ నగర్ ఏరియాల్లో అక్కడక్కడ కాటన్ సీడ్స్ కోసం పంట పండిస్తుంటారు. కానీ ములుగు జిల్లాలో మాత్రం మొక్కజొన్న సీడ్స్ కోసమంటూ ప్రయోగాలు చేస్తున్నారా.. లేకుంటే ఇది జన్యుమార్పిడి మొక్కజొన్న పంటా అన్నది అప్పట్లో తీవ్ర అనుమానాలకు దారి తీసింది. ఎందుకంటే జన్యుమార్పిడి ఆహార పంటలు పండించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకోవాలి. సీడ్స్ కోసమే పండిస్తే అనుమతులు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. అవి కూడా లేకుండా పోవడంతో ఒక దశలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విత్తన బ్యాగ్ లపై ఊరు పేరు ఏవీ లేవు. సీడ్ ఆర్గనైజర్స్ దొరికాక మ్యాటర్ ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ వచ్చింది.
GM – ఫ్రీ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిన FSSAI
2021 మార్చిలో FSSAI.. మొక్కజొన్న సహా 24 ఆహార పంటలను దిగుమతి చేసుకోవడానికి GM – ఫ్రీ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. ఒక పంట జన్యుమార్పిడా కాదా అన్నది పాలిమరేజ్ చైన్ రియాక్షన్ పద్ధతిలో తెలుస్తుంది. ఇటీవలే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ సైంటిస్టులు సమర్పించిన జర్నల్ లో భారత్ లో మొక్కజొన్న ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ లో జన్యుమార్పిడి చేసిన ఆనవాళ్లను గుర్తించారు. జీఎం పాజిటివ్ వచ్చింది. ఇది ఆందోళనపరిచే విషయం. ఇదే సీన్ ములుగు జిల్లా ఏజెన్సీలో రిపీట్ అయిందని గుర్తించారు.
5 – 6 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు
ములుగు జిల్లాలో జీఎం మొక్కజొన్న సాగు చేస్తున్నామన్న విషయం అక్కడి గిరిజన రైతులకు కూడా తెలియకుండా జరిగిపోయింది. కొన్ని విత్తన కంపెనీల పేర్లతో కొంతమంది ఆర్గనైజర్లు, ఏజెంట్లు వేసిన ఉచ్చులో పడ్డారు అమాయక రైతులు. మొక్కజొన్న విత్తనాలను సాగు చేస్తే ఎకరాకు 40 క్వింటాళ్ల దాకా పంట దిగుబడి వస్తుందని.. భారీగా ఆదాయం వస్తుందని ఆశ చూపించడంతో.. దాదాపు 5 నుంచి 6 వేల ఎకరాల్లో విత్తనాల కోసమే మొక్కజొన్న సాగు చేశారు అక్కడి రైతులు. కానీ పంట కోసే సమయానికి చూస్తే.. కనీసం ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి. రాతపూర్వకంగా ఏ కంపెనీ విత్తనాలను ఇస్తున్నారు.. ఎలా సాగు చేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎంతకు పంటను కొంటారన్న క్లారిటీ ఇవ్వలేదు. ఏజెంట్ల మాటలు నమ్మి సాగు మొదలుపెట్టిన రైతులకు చివరికి చుక్కలే కనిపించాయి. పొలాల్లో బోర్డులు కూడా పెట్టించలేకపోయారు. దీంతో చాలా డౌట్లు అప్పట్లో తెరపైకి వచ్చాయి.
ప్రభుత్వ చొరవతో ఇన్నాళ్లకు రైతులకు పరిహారం
మొక్కజొన్న పొత్తుకు గింజలు రాకపోవడంతో ఏజెంట్లు పంట కొనలేదు. నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతుల ఆందోళన చేయడంతో మ్యాటర్ అంతా బయటకు వచ్చింది. విత్తనాల కోసమే పంటలు సాగు చేయిస్తుంటే రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు రైతులకు పక్కాగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి రిజిస్ట్రేషన్ లేకుండా, కాంట్రాక్ట్ లేకుండా ఆర్గనైజర్స్ రంగంలోకి దిగారని రైతు సంఘాలు అప్పట్లోనే చెప్పాయి. అటు విత్తన కంపెనీలు కూడా డైరెక్ట్ గా రైతులతో డీల్ చేయకుండా ముందు జాగ్రత్తగా మధ్యవర్తులను రంగంలోకి దింపుతాయి. ఎవరు ఎన్ని చేసినా చివరికి రైతులే నష్టపోయారు. ఇన్నాళ్లకు ప్రభుత్వ చొరవతో వారికి పరిహారం అందబోతోంది.