ఒకప్పుడు తల్లి దండ్రులకు వృద్దాప్యంలో సంతానం తోడుగా ఉండేది. వారి ఆలనా పాలనా చూసుకునేది. కానీ ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులను పట్టించుకోవడం అటు పక్కన పెట్టి వాళ్ల దగ్గర ఉన్న ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారు. తీరా ఆస్తులు రాసిచ్చాక నువ్వెవరో నేనెవరో అన్నట్టు చేస్తున్నారు. కొంతమంది కొడుకులు, బిడ్డలు అయితే తల్లి దండ్రులను బయట వదిలిపెడుతున్న సందర్భాలు సైతం కనిపిస్తున్నాయి. కాబట్టి తల్లి దండ్రులు కూడా తమ సంతానానికి ఆస్తులు రాసిచ్చేముందు జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే ఆస్తులను తిరిగి తీసుకోవాలి. తాజాగా ఓ తండ్రి అలానే చేశాడు.
కొడుకు గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చిన పొలాన్ని తిరిగి తన పేరుమీద చేయించుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. కొమురయ్య అనే రైతు తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిని వారసత్వంగా గిఫ్ట్ డీడీ కింద రాసి ఇచ్చాడు. భూమి రాసిచ్చే వరకు సైలెంట్ గా ఉన్న కొడుకు ఆస్తి చేతికి వచ్చాక మారిపోయాడు. తండ్రినే పట్టించుకోవడం మానేశాడు. వయసు మీద పడటంతో పనిచేయలేక కొమురయ్యకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఆస్తి మొత్తం కన్నకొడుకు దగ్గర పెట్టుకుని తినడానికి తిండి కూడా పెట్టకపోవడంతో తీవ్ర ఆవేదన చెందాడు. చివరకు కొడుకుకే షాక్ ఇచ్చాడు.
తన కొడుకు పట్టించుకోవడం లేదని అతడి పేరిట రాసిన నాలుగు ఎకరాల భూమిని తిరిగి తనకు రాసివ్వాలని ఆర్టీఐ ఆఫీసుకు వెళ్లాడు. తన కొడుకుకు ఇచ్చిన ఆస్తిని తిరిగి తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో తన భూమిని తనకు తిరిగి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం అధికారులకు తెలియడంతో వెంటనే కొమురయ్య కొడుకు రవి దగ్గరకు వెళ్లి ఎలా అయినా ఆస్తిని తన తండ్రికి రాసిచ్చేయాలని చెప్పారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కొడుకు పేరు మీద ఉన్న ఆస్తిని తండ్రి పేరు మీదకు బదిలీ చేశారు. భూమికి సంబంధించిన పాస్ బుక్ ను కూడా కొమురయ్యకు ఇచ్చేశారు. ఈ వార్త వైరల్ అవ్వడంతో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు, కూతుళ్లు సైతం అప్రమత్తం అవుతున్నారట.