Hyderabad Fire Accident: హైదరాబాద్ లోని కుషాయిగూడ పరిధిలో గల చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల ధాటికి ఫ్యాక్టరీలో గల రసాయన డ్రమ్ములు పేలిపోయినట్లు సమాచారం. దీనితో మంటలు దట్టంగా వ్యాపించగా, పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. ఈ అగ్ని ప్రమాదంతో పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే క్షణాల వ్యవధిలో మంటలు ఇతర భవనాలకు సైతం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే సమాచారం అందుకున్న ఏసీపీ మహేష్, సీఐ రవికుమార్ లు అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అసలు ప్రమాదం జరగడానికి గల కారణాలను వారు స్థానికుల ద్వారా ఆరాతీస్తున్నారు. ఓవైపు మంటలు.. మరోవైపు భారీ శబ్దాలు వస్తుండగా స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొని ఉంది.
ఈ మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. కాగా మంటలు సుమారు రెండు గంటల నుండి దట్టంగా వ్యాపిస్తుండడంతో స్థానిక ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ దశలో అగ్నిప్రమాదం ధాటికి కెమికల్ కంపెనీ భవనం కుప్పకూలింది. అలాగే విష రసాయనాలు పొగ రూపంలో వ్యాపిస్తుండగా, స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, సఫలం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని ఫైర్ సేఫ్టీ అధికారులు తెలుపుతున్నారు. మొత్తం ఆరు ఫైర్ ఇంజన్లు ఈ ఆపరేషన్ లో పాల్గొనగా, ఎలాగైనా మంటలను అదుపు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
కాగా పోలీస్ ఉన్నతాధికారులు కూడ స్పందించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ ప్రదేశంలో పలు అంబులెన్స్ లను సైతం సిద్దం చేశారు. మంటలు అదుపులోకి రావడమన్నది కలేనంటూ స్థానికులు తెలుపుతున్నారు. ఈ మంటలు ఇలాగే కొనసాగితే, ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరి ఫైర్ అధికారులు తీసుకొనే చర్యలు సఫలం కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇంతకు అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి చర్లపల్లి ఇండస్ట్రీస్ సుగుణ కెమికల్స్‌లో ఎగసిపడుతున్న మంటలు pic.twitter.com/NWhj0lH7cL
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2025