Keerthy Suresh : సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్ ను డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీర్తి సురేష్ (Keerthy Suresh) కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ కాబోయే కొత్త జంట గోవాకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఓ పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చింది కీర్తి సురేష్.
కీర్తి సురేష్ (Keerthy Suresh), ఆంటోనీ తట్టిల్ (Antony Thattil) ల వివాహం డిసెంబర్ 12న గ్రాండ్ గా జరగబోతోంది. గోవా వేదికగా జరగనున్న ఈ పెళ్లి రెండు సంప్రదాయాల్లో జరగబోతోంది. ముందుగా హిందూ సంప్రదాయ పద్ధతిలో ఏడడుగులు నడవబోతున్న ఈ జంట, ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో ఉంగరాలు మార్చుకోబోతున్నారు. కీర్తి సురేష్ పెళ్లి నేపథ్యంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో KA Wedding అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. ఇదే ట్యాగ్ ని ఉపయోగించి కీర్తి, ఆంటోనీతో పాటు గోవా చేరుకున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. కీర్తి సురేష్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో గోవా టికెట్లకు సంబంధించిన ఫోటోని పోస్ట్ చేసింది. ఇక మరో స్టోరీలో తన స్నేహితురాలు వర్షంలో సరదాగా ఆడుతున్న ఫోటోను షేర్ చేసింది. దీంతో కీర్తి, ఆంటోనీ ఆల్రెడీ గోవాకు చేరుకున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
దాదాపు 15 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్న కీర్తి, ఆంటోని ఎట్టకేలకు ఒక్కటి కాబోతున్నారు. దీపావళి సందర్భంగా డేటింగ్ విషయాన్ని బయట పెట్టింది ఈ జంట. పెళ్లి వేడుకలు త్వరలోనే మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో “డిసెంబర్ 12న మా కుమార్తె వివాహం అని మీకు తెలియజేయడం ఆనందంగా ఉంది. కీర్తి, ఆంటోని కలిసి తమ జీవితంలో కొత్త ఆధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నారు. కొత్త జంటను మీరంతా ఆశీర్వదిస్తారని కోరుతున్నాము” అంటూ రాసుకోచ్చారు కీర్తి తల్లిదండ్రులు. ఇక అంతకుముందు కీర్తి సురేష్ నవంబర్లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించింది. ఆ టైంలో ఆమె వెంట తండ్రి, నిర్మాత జి సురేష్ కుమార్, నటి-తల్లి మేనక ఉన్నారు. అలాగే గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్టు శ్రీవారి దర్శనం టైమ్ లో వెల్లడించింది కీర్తి సురేష్ (Keerthy Suresh). ఇక పెళ్లి విషయం బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీ బయట ఎక్కడా కనిపించలేదు.
ఇదిలా ఉండగా కీర్తి సురేష్ (Keerthy Suresh) పెళ్లి మూడు రోజుల వేడుకగా జరగబోతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం హల్దీ, సంగీత్ వంటి వేడుకలతో మూడు రోజుల పెళ్లి చేసుకోనుంది కీర్తి. అయితే రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లిని మాత్రం ఒకే రోజు… అంటే డిసెంబర్ 12న ఉదయం హిందూ సాంప్రదాయంలో, సాయంత్రం క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక కీర్తి సినిమాల విషయానికొస్తే.. వరుణ్ ధావన్ తో ‘బేబీ జాన్’, అట్లీ – దళపతి విజయ్ ‘తేరి’ బాలీవుడ్ రీమేక్‌లో హీరోయిన్ గా నటిస్తోంది.