Ramachandra Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రామచంద్రారెడ్డి సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామానికి చెందినవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉండగా ప్రస్తుతం వారి వద్దనే హైదరాబాద్ లో ఉంటున్నారు. దుబ్బాక ఒకప్పుడు దొమ్మాట నుండి 1983లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో కేసీఆర్ కు రామచంద్రారెడ్డి రాజకీయ సమకాలికుడిగా చెబుతుంటారు.
మాజీ ఎమ్మెల్యే మృతిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంతాపం ప్రకటించారు. 19883-88లో అప్పటి దొమ్మాట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేశారు. ఆయన సేవలు నేటితరం రాజకీయ నాయకులకు ఎంతో స్పూర్తి అని కొనియాడారు, ఎమ్మెల్యే అయినా తుదిశ్వాస వరకు సాధారణ జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు. ఆయన ప్రజాసేవకు పరితపించారని, నియోజకవర్గ ప్రజల్లో ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.