World War 3 Warning: ఓరెష్నిక్‌తో దాడులు చేయడం మాత్రమే కాదు.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. తన ఆర్మీ చీఫ్‌లతో సమావేశమై వారికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా దూకుడుకు కళ్లెం వేయాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదంటున్నారు. మరి పుతిన్ తీసుకున్న ఆ నిర్ణయాలేంటి? ఈ నిర్ణయాలు మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభమా? అసలు మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే ప్రారంభమైందా?
ఎప్పుడైతే అమెరికా అందించిన లాంగ్ రేంజ్ మిసైల్స్‌తో ఉక్రెయిన్ దాడులు చేసిందో అప్పటి నుంచి చాలా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మొదట రష్యా అణు విధానంపై పుతిన్ సమీక్ష నిర్వహించారు. అవసరమైతే అణు దాడులు చేస్తామని ప్రపంచానికి ఓ వార్నింగ్ పంపారు. ఆ తర్వాత ఓరెష్నిక్ హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్‌తో దాడులు చేసింది రష్యా. ఆ తర్వాత తన ఆర్మీ చీఫ్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పుతిన్. ఈ వరుస ఘటనలు ఇప్పుడు కాస్త ఆందోళన పెంచుతున్నాయి.
ఆర్మీ చీఫ్‌లతో భేటీ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు పుతిన్. హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్‌ను యుద్ధ క్షేత్రంలో పరీక్షించేందుకు అనుమతిచ్చారు. ఆ తర్వాత ఈ తరహా మిసైల్స్ ఉత్పత్తిని పెంచాలన్నారు. అవసరమైన మార్పులు చేయడం.. మరింత శక్తివంతంగా మార్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవి పైకి మాములుగా కనిపించినా.. చాలా ప్రమాదకరమైన నిర్ణయాలనే చెప్పాలి. ఎందుకంటే యుద్ధక్షేత్రంలో ఓరెష్నిక్ మిసైల్స్‌ను పరీక్షించడం అంటే.. ఇకపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి దాడులు జరిగినా.. వీటినే ఉపయోగించే చాన్స్ ఎక్కువగా ఉంది. ప్రచండ వేగంతో దూసుకొచ్చే ఈ మిసైల్స్‌ను అడ్డుకునే వ్యవస్థ లేదు కాబట్టి.. ఉక్రెయిన్‌కు భారీ నష్టం తప్పదు. మరో వైపు వీటి ఉత్పత్తిని పెంచడం వెనక ఆంతర్యమేంటన్నది ఆలోచిస్తే కాస్త టెన్షన్ పెరుగుతోంది.
ఓరెష్నిక్ మిసైల్ రేంజ్ 5 వేల కిలోమీటర్లు. ఈ రేడియస్‌లో అనేక NATO దేశాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌తో పాటు.. ఆ దేశానికి సహకరించే వారిపై కూడా దాడులు చేస్తామని చెబుతోంది రష్యా. అంటే ఉక్రెయిన్ దాడులు చేస్తే వీటిపై కూడా రష్యా దాడులు చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ మిసైల్స్ వాటి లక్ష్యాలను చేరుకుంటాయా? వాటిని మధ్యలోనే ఆ దేశాలు అడ్డుకుంటాయా? అనేది పక్కన పెడితే.. రష్యా దాడులు చేసేందుకు ప్రయత్నించింది అనేదే పెద్ద విషయం. దీనిపై ఆ దేశాల నుంచి వచ్చే రియాక్షన్ ఖచ్చితంగా ప్రభావం చూపుతోంది. ఎందుకంటే NATO దేశంపై రష్యా దాడి చేస్తే.. ఆ తర్వాత ఆ దేశాలన్ని కలిసి రష్యాపై దాడులు చేసే అవకాశం ఉంది.
ఉక్రెయిన్ నాటోలో భాగం కాదు. కానీ నాటో దేశాలన్ని ఇప్పటివరకు పరోక్షంగా సాయం చేస్తూ వచ్చాయి. పేరుకు ఉక్రెయిన్ రష్యాపై దాడి చేస్తున్నా.. దాన్ని వెనకుండి నడిపించేది నాటో దేశాలన్నది బహిరంగ రహస్యం. నాటో దేశంపై దాడి జరిగితే మిగిలిన దేశాలన్ని స్పందించాలి.. ఆ దేశానికి సాయంగా ఉండాలనేది రూల్. ఉక్రెయిన్ టెక్నికల్‌గా నాటోలో లేదు కాబట్టి.. ఇప్పటి వరకు ఇలా పరోక్షంగా యుద్ధాన్ని నడిపిస్తున్నాయి అమెరికా, దాని మిత్రదేశాలు. కానీ రష్యా ఇప్పుడు నేరుగా NATOలో ఉన్న దేశంపై దాడి చేస్తే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్టే.
Also Read: మూడో ప్రపంచ యుద్ధం.. బాబా వంగా, నోస్ట్రాడమస్ చెప్పింది ఇదే, మీరు సిద్ధమేనా?
ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందంటూ ప్రచారం జరుగుతోంది. రష్యాలో ఉత్తర కొరియా సైనికులు ఉన్నారని.. చైనా కూడా రష్యాకు మద్దతు ఇస్తుందని.. అందుకే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందంటూ ఓ ఉక్రెయిన్ ఆర్మీ ఉన్నతాధికారి చెప్పినట్టు కథనాలు వెలువడుతున్నాయి. అయితే అసలు ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాలు, మిసైల్స్, ఆర్మీ ఇంటెలిజెన్స్‌తో పాటు ఆర్మీ కమాండర్లను ఉక్రెయిన్‌కు పంపాయి అమెరికా, దాని మిత్ర దేశాలు. వీటన్నింటిని రష్యా ఇన్నాళ్లు ఒంటరిగానే ఎదుర్కొన్నది కదా. మరి అప్పుడు ఎందుకు మూడో ప్రపంచ యుద్ధం అనే మాట రాలేదనేది రష్యా నుంచి ఎదురవుతున్న ప్రశ్న.
తిలా పాపం.. తలా పిడికెడు.. అనే కాన్సెప్ట్ ఇక్కడ పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది. లాంగ్ రేంజ్ మిసైల్స్ వాడకం విషయంలో అనుమతి ఇవ్వాళ్లంటూ జెలెన్ స్కీ ఎన్నాళ్లుగానో వేడుకుంటున్నా పట్టించుకోని అమెరికా.. హడావుడిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఇచ్చిన గంటల్లోపే ఉక్రెయిన్ రష్యాపై దాడులు చేయడం.. ఇదే అదునుగా రష్యా హైపర్ సోనిక్ మిసైల్స్‌ను ప్రయోగించడం.. అణు విధానాన్ని సమీక్షించడం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పరిణామాలు జరిగిపోతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ పరిణామాలు మరింత పెరిగే అవకాశమే కనిపిస్తోంది తప్ప.. తగ్గేలా లేవు. అయితే పరిస్థితుల్లో ఏదైనా మార్పు రావాలంటే అమెరికాలో అధికార బదిలీ జరగాలి. ఇప్పటికే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తే ఈ పరిణామాల్లో మార్పు వచ్చే పరిస్థితి ఉంది.
తాను గెలిచిన తర్వాత ఒక్క రోజులో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానని ఇప్పటికే అనేక సార్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఇది చేతల రూపంలో జరుగుతుందా? లేదా? అనేది పెద్ద డౌట్. ఎందుకంటే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ గట్టిగానే జరిగేలా కనిపిస్తోంది. బైడెన్ తీసుకున్న నిర్ణయంతో ట్రంప్ ఇప్పుడు వెనక్కి వెళ్లలేని సిట్యూవేషన్. ఎందుకంటే ఈ నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కి తీసుకుంటే ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పటికే జెలెన్ స్కీ రష్యా చేసిన దాడిపై ప్రపంచం స్పందించాలని స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. అయితే ఉక్రెయిన్ చేసిన దాడులపై మాత్రం నోరు మెదపడం లేదు. మరో విషయం ఏంటేంటే.. రష్యా ICBMలతో దాడులు చేసిందని ఉక్రెయిన్ ప్రకటించింది కానీ.. దాని వల్ల ఏం నష్టం జరిగింది? అనేది మాత్రం ప్రపంచానికి చెప్పలేదు.
అయితే ట్రంప్ బాధ్యతలు చేపట్టేముందు రష్యా దాడులను తీవ్రతరం చేయడం కూడా వ్యూహత్మకమే అని తెలుస్తోంది. ఎందుకంటే రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై వెయ్యి రోజులు దాటింది. ఒకవేళ ట్రంప్ వచ్చిన తర్వాత చర్చలు ప్రారంభమైతే.. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండేందుకు ఉక్రెయిన్, రష్యా రెండూ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే క్రిమియా సహా అన్ని ఆక్రమిత భూభాగాలను తిరిగి అప్పగించాలన్నది జెలెన్‌స్కీ డిమాండ్. అయితే కాల్పుల విరమణ తప్ప దేనికి అంగీకరించేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. మరి ట్రంప్ వచ్చే వరకు ఎలాంటి పరిణమాలు జరుగుతాయో.. ట్రంప్ వచ్చిన తర్వాత వచ్చే మార్పులేంటో అనే దానిపైనే ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా భవిష్యత్తుతో పాటు.. ప్రపంచ దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉంది.