Formula E Race Case: ఫార్ములా-ఈ రేసు కేసు ముగింపు దశకు చేరుకుందా? జూన్ చివరి నాటికి ఫైనల్ ఛార్జిషీటు వేయాలని ఏసీబీ భావిస్తోందా? కేటీఆర్‌ను ఎప్పుడు విచారిస్తున్నారు? ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఆయన ఉన్నారు. అటు నుంచి రాగానే విచారణకు హాజరుకానున్నారా? ఈ కేసులో అసలు నిందితులు ఎవరు? అన్నది అసలు పాయింట్.
ఫార్ములా-ఈ రేసు కేసు దర్యాప్తు వ్యవహారం కీలక దశకు చేరింది. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ చివరి నాటికి ఫైనల్ ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆలోచన చేస్తోంది ఏసీబీ. ఈలోగా మాజీ మంత్రి కేటీఆర్‌ను మరోసారి విచారించనున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు.
షెడ్యూల్ ప్రకారం మే 28న కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సివుంది. విదేశీ పర్యటన నేపథ్యంలో హాజరు కాలేనని సమాచారం ఇచ్చారు మాజీ మంత్రి. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. వచ్చేవారంలో కేటీఆర్ హైదరాబాద్‌కు రానున్నట్లు ఆ పార్టీ వర్గాల మాట. జూన్ మూడోవారం అధికారుల ముందు ఆయన రానున్నట్లు సమాచారం.
ఏసీబీ ఈ కేసు దర్యాప్తు చేపట్టి దాదాపు ఐదునెలలు పూర్తి అయ్యింది. దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం తగదని, దీనివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారట అధికారులు. అయితే దర్యాప్తులో వెల్లడైన అంశాలు నిర్ధారించుకునేందుకు చివరిగా కేటీఆర్‌ను విచారించనున్నారు.
ALSO READ: హైదరాబాద్ పాతబస్తీలో కారు బీభత్సం.. నలుగురు యువకులు పరార్
హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసులో అవకతవకలు జరిగాయంటూ గతేడాది కేసు నమోదయ్యింది. రేసు నిర్వహణ కోసం ఒప్పందంలో భాగంగా ఫార్ములా-ఈ ఆపరేషన్స్-FEO కు 55 కోట్ల రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారన్నది ప్రధాన అభియోగం.
అప్పటి మంత్రి కేటీఆర్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ అప్పటి ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి లను నిందితులుగా పేర్కొంది. దర్యాప్తు నేపథ్యంలో పై వ్యక్తులను విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. సాక్షులుగా కొంతమంది అధికారులను విచారించారు.
ఫార్ములా రేసు నిర్వహణకు స్పాన్సర్లగా వ్యవహరించిన గ్రీన్‌కో సంస్థపై సోదాలు చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ ప్రతినిధులను విచారించారు. దీనికితోడు లండన్‌లో ఉన్న ఎఫ్‌ఈవో ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండుసార్లు విచారించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగింది.
విదేశీ సంస్థలకు ప్రభుత్వం నగదు బదిలీ చేసినప్పుడు RBI నుంచి అనుమతి పొందాలి. అలా చేయకుండా నేరుగా విదేశీ సంస్థకు కోట్లాది రూపాయలు బదిలీ చేయడంపై లోతుగా విచారణ చేపట్టింది. బదిలీ అయిన ఆ నిధులు ఎవరి ఖాతాలో ఉన్నాయనేది కీలకంగా మారాయి.
విచారణలో వెల్లడైన అంశాలను నిర్ధారించుకునేందుకు మరోమారు నిందితులను విచారించనుంది ఏసీబీ. అంతా అనుకున్నట్లు జూన్ చివరలో ఛార్జిషీటు దాఖలు చేసి ఈ కేసుకు ముగింపు పలకాలని ఆలోచన చేస్తోంది ఏసీబీ.