రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం(సెప్టెంబర్ 25న) నాడు మధురకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి బృందావన్ చేరుకుని ఆలయాలను సందర్శించనున్నారు. ఢిల్లీ నుంచి మధురైకి వెళ్లడానికి ఆమె ప్రత్యేక రైలును ఉపయోగిస్తారని రైల్వే అధికారులు వెల్లడించారు. “రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 8:10 గంటలకు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు ఎక్కి మధుర చేరుకుంటారు. మధుర, బృందావన్ మధ్య రైలు కనెక్టివిటీ లేనందున ఆమె అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు. తిరుగు ప్రయాణంలో, సాయంత్రం మధుర నుంచి అదే రైలులో వెళ్తారు” అని సీనియర్ రైల్వే అధికారులు వెల్లడించారు.
ఇక రాష్ట్రపతి ముర్ము పర్యటన నేపథ్యంలో ఢిల్లీ- మధురై మార్గంలోని రైల్వే అధికారులకు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. సీనియర్ రైల్వే అధికారులు, స్టేషన్ మాస్టర్లు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీస్(GRP) సిబ్బంది, సంబంధిత ఇతర సిబ్బందికి అవసరమైన సూచనలు జారీ చేసినట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.
ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరే, గమ్యస్థాన స్టేషన్లు రెండు వేర్వేరు రైల్వే జోన్లలో ఉన్నాయి. ఈ ప్రయాణం ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే పరిధిలో కొనసాగుతుంది. రెండు జోన్లు సజావుగా, సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి సమన్వయం చేసుకోవాలని ఉన్నతాధికారులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!
రాష్ట్రపతి ప్రత్యేక రైలు అనేది రాష్ట్రపతి దేశంలో అరుదుగా ప్రయాణించేందుకు ఉపయోగిస్తారు. ఈ రైలు ప్రయాణం చాలా ముందుగానే నిర్ణయిస్తారు. రైలులో ప్రయాణించడానికి ఎంచుకున్నప్పుడల్లా జోనల్ రైల్వేలతో సమన్వయం చేసుకుంటారు రైల్వే అధికారులు. ఈ రైలు అత్యంత భద్రతతో కూడి ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సురక్షితమైన సెరిమోనియల్ , రైలును నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ముర్ము జూన్ 2023లో భువనేశ్వర్ నుంచి ఒడిశాలోని తన స్వస్థలం రాయరంగ్ పూర్ కు ప్రయాణించినప్పుడు ఈ ప్రత్యేక రైలును ఉపయోగించారు. మళ్లీ ఇప్పుడు మధురై పర్యటనకు ఉపయోగిస్తున్నారు. నిజానికి ఈ రైలును అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఉపయోగిస్తారు. దేశీయ పర్యటనలకు కూడా ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాలను ఉపయోగిస్తారు రాష్ట్రపతి. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ రైలును వినియోగిస్తారు. అత్యవసరమైన ప్రయాణాలకు కాకుండా కాస్త రిలాక్స్ గా వెళ్లాలి అనుకున్న సమయంలోనే ఈ రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు.
Read Also: ఇవాళ 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అంటే?