Komatireddy VenkatReddy : మునుగోడు ఉప ఎన్నికల వేళ తీవ్ర వివాదాస్పదమైన నేతగా నిలిచారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయన చుట్టూ జరిగిన వివాదం అంతాఇంతా కాదు. అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చినా.. వెంకట్ రెడ్డి రిప్లై ఇవ్వకపోవడం ధిక్కార ధోరణికి నిదర్శనం అంటున్నారు. అయినా, హైకమాండ్ మరో ఛాన్స్ ఇచ్చింది. మళ్లీ షోకాజ్ జారీ చేసింది. ఈసారి తాను రిప్లై ఇచ్చానన్నారు కోమటిరెడ్డి.
మొదటి షోకాజ్ నోటీసును వెంకట్ రెడ్డి డోంట్ కేర్ అనడంతో.. ఆయనిక కాంగ్రెస్ ను వీడుతారంటూ ప్రచారం జరిగింది. అయితే, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడంతో ఒక్కసారిగా వెంకట్ రెడ్డి డిఫెన్స్ లో పడినట్టు ఉన్నారు. తెలంగాణలో బీజేపీకి ఇంకా టైం రాలేదు అనుకున్నారో ఏమో.. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, ఎక్కడికి వెళ్లలేదంటూ స్పష్టం చేశారు.
ఇక, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఎందుకు పాల్గొనలేదనే ప్రశ్నకూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాస్త కవర్ చేసుకునేలా ఆన్సర్ ఇచ్చారు. తనకు షోకాజ్ నోటీసులు ఇస్తే జోడో యాత్రలో ఎలా పాల్గొంటా? క్లీన్ చీట్ వచ్చాకే కదా రాహుల్ పాదయాత్రలో పాల్గొనేది అంటూ రివర్స్ ప్రశ్నించారు.
వెంకట్ రెడ్డి వ్యవహార శైలిని నిషితంగా గమనిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్.. త్వరలోనే వెంకట్ రెడ్డిపై కఠిన నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. సీనియర్ నేత కాబట్టి.. రెండోసారి షోకాజ్ నోటీసులిచ్చి మరింత సమయం ఇచ్చారని.. ఆయన తీరు మారకపోతే వేటు తప్పదంటూ ప్రచారం జరుగుతోంది.
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే.. ఆయన ఈపాటికే పార్టీని వీడి.. బీజేపీలో చేరిపోయే వారని స్థానికంగా చర్చ నడుస్తోంది. తమ్ముడి ఓటమితో షాక్ కు గురైన వెంకట్ రెడ్డి.. ఎందుకైనా మంచిదన్నట్టు కాస్త తగ్గారని అంటున్నారు. మరింత కాలం కాంగ్రెస్ లోనే వేచి ఉండాలని కోమటిరెడ్డి భావిస్తుండగా.. హైకమాండ్ ఏ క్షణంలోనైనా యాక్షన్ తీసుకోవచ్చని అంటున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలేమాత్రం బాగాలేని ప్రస్తుత దుస్థితిలో వెంకట్ రెడ్డి లాంటి బలమైన సీనియర్ నేతపై అంత ఈజీగా చర్యలు తీసుకునే అవకాశం తక్కువేనంటున్నారు విశ్లేషకులు.