Gadwal Study: స్వేచ్చ బ్యూరో: పోటీ పరీక్షలకు సిద్ధమై ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల రైల్వే స్టేషన్ పక్కన ఒక అద్దె భవనంలో ఏర్పాటు చేసిన టీజీ బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు స్టడీ సర్కిల్ కి వెళ్లి రావడం ఇబ్బందిగా మారింది. గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్, ఫ్లైఓవర్ సమీపంలో ఓ ప్రైవేట్ అద్దె భవనంలో స్టడీ సర్కిల్ నిర్వహిస్తున్నారు. మారుమూళ్ల గ్రామాల నుంచి బస్సులు, ప్రైవేటు వాహనల ద్వార వస్తున్న విద్యార్థులకు ప్రధాన రహదారి నుంచి తగిన రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. మారుమూల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు జిల్లా ఆసుపత్రి వద్ద దిగి అక్కడి నుంచి స్టడీ సర్కిల్‌కు చేరుకోవాల్సి వస్తోంది.
గద్వాలలో రైల్వే స్టేషన్ స్టడీ సర్కిల్‌కు వెళ్లే మార్గంలో మహిళా అభ్యర్థులు ఆకతాయిల వేధింపులు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రాకపోకలు సాగించే సమయంలో భద్రతపై భయాందోళనలు నెలకొంటున్నాయి. నిర్మానుష్యంగా ఉండే మార్గాలు, సరైన రవాణా సౌకర్యం లేకపోవడం విద్యార్థినులకు ఇబ్బందిగా మారింది. మహిళా అభ్యర్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఓ వైపు రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలు, మరోవైపు ఫ్లైఓవర్‌పై వాహనాల శబ్దాలతో ప్రశాంతంగా చదువుకునే పరిస్థితి లేదని అభ్యర్థులు వాపోతున్నారు. పోటీ పరీక్షలకు ఏకాగ్రతతో సిద్ధం కావాల్సిన విద్యార్థులకు ఈ వాతావరణం ఇబ్బందికరంగా మారుతోంది. సరిపడా తరగతి గదులు, విశాలమైన రీడింగ్ రూమ్, గ్రంథాలయ సౌకర్యాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది.
కొత్త జిల్లాలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా గద్వాల బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం లేకపోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా లేకపోవడంతో అద్దె గదుల్లో ఉంటూ చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు అభ్యర్థులు శిక్షణకు దూరమవుతున్నారు.
బీసీ విద్యార్థుల అభ్యున్నతికి ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. రైల్వే స్టేషన్ పక్కన భవనం నుంచి మరొక్క చోటుకు బీసీ స్టడీ సర్కిల్ మార్చాలని విన్నపిస్తున్నారు. మహిళా అభ్యర్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ స్థలం కేటాయించి సొంత భవనం నిర్మించడంతో పాటు హాస్టల్, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరిస్తారా.. లేదా అన్నది వేచి చూడాలి.
Also Read: పాలమూరులో నిబంధనలను విరుద్ధంగా.. ప్రభుత్వ ఉద్యోగులు!