Bhadrachalam: దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం.. శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం కోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రసాదం పథకం కింద రూ.41.38 కోట్లు మంజూరు చేసింది. భద్రాచలం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అభివృద్ధికి ఈ నిధులతో భారీ ప్రాజెక్టును చేపట్టారు.
2022 డిసెంబర్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలానికి వచ్చారు. సీతారామచంద్రస్వామిని దర్శించుకుని.. ప్రసాదం పథకం పనులకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో భక్తులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వసతి సదుపాయాలు.. పార్కింగ్.. కల్యాణ మండపం.. స్ట్రీట్స్ సుందరీకరణ, సావనీర్ షాపులు.. షెల్టర్లు.. రెయిలింగ్స్.. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈ-బగ్గీలు.. తాగునీరు.. మరుగుదొడ్లు.. ఫుడ్ కోర్టు.. సోలార్ లైటింగ్.. సీసీ కెమెరాలు.. ఇలా భక్తుల సౌకర్యం కోసం పెద్ద ప్లాన్ వేశారు. కానీ.. శంకుస్థాపన జరిగి ఏళ్లు గడిచిపోయాయి. పనులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి.. కానీ వాటిని భక్తులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే పరిస్థితి ఇంకా కనిపించడం లేదు. మరోవైపు వసతి సదుపాయాలకు సంబంధించిన పనులు కూడా నెమ్మదిగానే సాగుతున్నాయి.
ఇప్పుడు అసలు టెన్షన్ ఏంటంటే.. గోదావరి పుష్కరాలు దగ్గరపడుతున్నాయి. పుష్కరాల సమయంలో భద్రాచలానికి భక్తుల తాకిడి భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాంటి సమయంలో సౌకర్యాలు సిద్ధంగా లేకపోతే.. భక్తులకు ఇబ్బందులు తప్పవు. భద్రాద్రికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్నదే ప్రసాదం పథకం లక్ష్యం. మరి ఆ లక్ష్యం ఎప్పుడు పూర్తవుతుంది..? గోదావరి పుష్కరాల నాటికైనా పనులు కొలిక్కి వస్తాయా..? దీనికి సమాధానం అధికారులే చెప్పాలి.
Also read: సిరిసిల్లలో చనిపోయిన వారి పేర్లతో లేబర్ కార్డుల దందా.. బీమా సొమ్ము మాయం