Farm Land Fraud: సాధారణంగా భూముల కొనుగోలుపై ప్రజలకు సూచనలు చేసే పోలీసులు.. ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ కొనుగోలు విషయంలోనే అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఫామ్ ల్యాండ్స్ కొనుగోలు చేసి మోసపోయామంటూ పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రోచర్లలో చూపించిన స్థలాలు క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం.. కొనుగోలు చేసిన భూములకు హద్దులు గుర్తించలేకపోవడం.. అమ్మకాల తర్వాత రియల్టర్లు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో భూమి రికార్డులు, హద్దులు, అనుమతులు పూర్తిగా పరిశీలించకుండా పెట్టుబడులు పెట్టవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
నారాయణఖేడ్‌లో ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం..
ఒక్కవైపు పోలీసుల హెచ్చరికలు కొనసాగుతున్నా.. ఫామ్ ల్యాండ్ వ్యాపారం మాత్రం తగ్గడం లేదు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని నాగలిగిద్ద, కంగ్టి మండలాలు ఈ వ్యాపారానికి కేంద్రాలుగా మారాయి. సుమారు 18 వేల ఎకరాల పరిధిలో 70కి పైగా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు ఈ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. అయితే ఈ ఆకర్షణీయమైన ప్రచారాల వెనుక భూముల చట్టబద్ధతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఫామ్ ల్యాండ్స్ వెనుక రాజకీయ అండదండలు?
ఈ ఫామ్ ల్యాండ్ వ్యాపారంలో అసలు వివాదం భూముల విక్రయ విధానంపైనే ఉంది. రైతుల నుంచి ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు కొనుగోలు చేసి.. వాటిని గుంటల చొప్పున విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక గుంటకు 160 గజాల లెక్కన ధర నిర్ణయించి వ్యవసాయ భూములుగానే రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. హద్దురాళ్లకు బదులుగా మొక్కలు నాటి సాగు భూములుగా చూపిస్తూ ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ వ్యవహారం వెనుక స్థానిక రాజకీయ ప్రముఖుల అండదండలు ఉన్నాయనే ప్రచారం కలకలం రేపుతోంది. ఎకరాకు ముడుపుల వ్యవహారం నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ.. వీటిపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
భూములు కొనకండి.. పోలీసులు
ఒకవైపు పోలీసులే భూములు కొనొద్దంటూ హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. బాధితుల ఫిర్యాదులు, అక్రమ విక్రయాల ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే సొంతంగా నాలుగు గుంటల భూమి కొనుక్కోవాలనే సామాన్యుల ఆశ.. మోసగాళ్ల చేతిలో పెట్టుబడిగా మారే ప్రమాదం ఉంది.
Also Read: ఏపీని వణికించేందుకు వస్తున్న ఆక్వాన్ తుఫాన్.. నవంబర్ 17 నుంచే భారీ వర్షాలు!