Telangana Farmer: పచ్చగా కళకళలాడాల్సిన వరి పొలం.. నీళ్లు లేక నెర్రెలు బారుతోంది. ఆ పంటను ఎలాగైనా బతికించుకోవాలని ఆ యువ రైతు పడుతున్న ఆరాటం ఇది. ఈయన పేరు గొడుగు తిరుపతయ్య. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం రాయచెడ్ గ్రామం. ఎన్నో ఆశలతో రెండు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట కూడా బాగానే పెరిగింది, ఇంకొద్ది రోజుల్లో కోతకు వస్తుందనుకున్నాడు. కానీ, సరిగ్గా అదే టైమ్‌లో పది రోజుల క్రితం పొలంలోని బోరు ఒక్కసారిగా ఎండిపోయింది.
వరి కోసం.. పక్క గ్రామం నుంచి వాటర్ ట్యాంకర్లు..
సాధారణంగా రెండెకరాల వరి సాగు చేయాలంటేనే విత్తనాలు, ఎరువులు, కూలీలు అంటూ వేలల్లో పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడి అంతా తిరుపతయ్య అప్పు చేసే పెట్టాడు. ఇప్పుడు పంట చేతికొచ్చే చివరి దశలో నీళ్లు పెట్టకపోతే, ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి మొత్తం మట్టిలో కలిసిపోతుంది. అందుకే, చేసేది లేక పక్క గ్రామం నుంచి వాటర్ ట్యాంకర్లను తెప్పిస్తున్నాడు. ఒక్కో ట్యాంకర్‌కు 500 రూపాయలు చెల్లిస్తున్నాడు. నిజానికి ట్యాంకర్లతో నీళ్లు కొని వరి పండిస్తే.. పంట అమ్మాక వచ్చే డబ్బులు కనీసం ఆ నీళ్ల ఖర్చులకు కూడా సరిపోవు. అయినా సరే, కన్నబిడ్డలా పెంచుకున్న పంట కళ్లముందే చనిపోతుంటే తట్టుకోలేక.. మరింత అప్పు చేసి మరీ నీళ్లు కొంటున్నాడు.
Also Read: మరో 30 ఏళ్లయినా కాంగ్రెస్‌కు అధికారం దక్కదు: అమిత్ షా