Gajjala Kantham: గాంధీ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆస్తులు, కంపెనీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆస్తులు, హోటళ్లపై సవాల్
కేటీఆర్ వద్ద 2006లో 3 హోటళ్లు ఉన్నాయంటున్నారని, ధైర్యముంటే వాటికి సంబంధించిన అసలు పత్రాలు బయటపెట్టాలని కాంతం డిమాండ్ చేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూనే హోటల్ నడిపానని కేటీఆర్ చెబుతున్నది పచ్చి అబద్ధమని, 2006 నాటికి అసలు అక్కడ అటువంటి హోటల్ లేదని విమర్శించారు. 2009 నాటి ఎన్నికల అఫిడవిట్‌లో ఈ వివరాలు ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. కేటీఆర్ చెబుతున్న ఆ మూడు హోటళ్లు పట్టాభి రామ్, తెలుకుంట్ల శ్రీధర్‌లకు చెందినవని, వాటి అసలు విలువ రూ.5,000 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
కంపెనీలు, విల్లాలలో అక్రమాలు
కేటీఆర్ వివిధ వ్యాపారులను బెదిరించి వాటాలు లాక్కున్నారని గజ్జెల కాంతం తీవ్రంగా ఆరోపించారు. ‘ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీస్’ సంస్థలో మొదట బెదిరించి 26% షేర్లతో డైరెక్టర్‌గా చేరారని, అనంతరం 2021లో తన భార్య పేరు మీదకు 25% వాటా మార్చి, 2022 నాటికి 50% వాటాను పూర్తిగా తమ సొంతం చేసుకున్నారని తెలిపారు.
అంతేకాకుండా తెలంగాణ పబ్లికేషన్స్, ఆలేఖ్య వెంచర్స్, ఆరుస్ బేకింగ్ పామ్, సద్గురు సాఫ్ట్‌వేర్, జన్మేయర్ హెల్త్‌కేర్ లాంటి 6 కంపెనీలను తన భార్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించారని ధ్వజమెత్తారు. నార్సింగ్‌లో ఉన్న విల్లాతో పాటు కోకాపేట్‌లో ఉన్న నాలుగు విల్లాలు, కోహినూర్ హోటల్‌లో పొందిన 25% వాటా ఏవిధంగా వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు.
మారుతున్న మాటలపై మండిపాటు
హైదరాబాద్‌లో తమకు ఇల్లు, సొంత స్థలం లేదని 2026 సెప్టెంబర్‌లో చెప్పిన కేటీఆర్, అక్టోబర్ 1 నాటికి మాట మార్చి హోటళ్లు, ఆస్తులు ఉన్నాయని ప్రచారం చేసుకోవడం ఆయన నైజానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. గతంలో కేటీఆర్ అంటే ఎవరికీ తెలియదని, ఆయనను చూసి దేశంలో నేతలు అబద్ధాలు నేర్చుకోవచ్చని కాంతం వ్యాఖ్యానించారు.