House Pattas: దశాబ్దాలుగా పేదలు కన్న సొంతింటి కలను సాకారం చేస్తూ వారి ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తున్న ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇందిరమ్మ సహా వివిధ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న పేదలకు గతంలో జారీ చేసిన పట్టాలను తిరిగి అందించాలని నిర్ణయించినట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు పేదల సొంతింటిపై హక్కును మరింత భద్రం చేస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది పేద కుటుంబాలకు ఊరటనివ్వనుందన్నారు.
గతంలో అమలు చేసిన విధానం ప్రకారం ప్రభుత్వం వద్దనే ఉన్న లబ్ధిదారుల ఇండ్ల పట్టాలు/పొజిషన్ సర్టిఫికేట్లను తిరిగి వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా 7 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.దాదాపు దశాబ్దానికి పైగా లబ్ధిదారులకు సంబంధించిన వారి ఇంటి పట్టా సర్టిఫికేట్లు తిరిగి రాకపోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నట్లుగా తనకు అనేక విజ్ఞాపనలు వచ్చిన దరిమిలా ఈ అంశంలో ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
రాష్ట్రంలో 22ఎ మీద సమీక్షలు జరుగుతున్న సమయం లో ఈ పట్టాలు తహసీల్దార్ ఆఫీస్ లలో భారీగా ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి రాగా వెంటనే పేదలకు వాటిని వాపస్ చేయాలంటూ ఆదేశించారని దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లకు ఈ ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.2014 కంటే ముందు అమలు చేసిన పథకంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ సబ్సిడీతోపాటు, లబ్ధిదారుల వాటా తోపాటు, బ్యాంకు రుణం ద్వారా ఆర్ధిక సహాయం అందించే వారు. ఈ రుణాల కోసం లబ్ధిదారుల ఇండ్లకు చెందిన పట్టాలను ష్యూరిటీగా ఉంచుకునేవారు. రుణ వాయిదాలన్నిటిని సక్రమంగా కట్టి, మొత్తాన్ని తిరిగి చెల్లించిన వారికి పట్టాలను తిరిగి ఇచ్చేవారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత , ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని నిలిపివేయడంతో ఇళ్ల పట్టాలు లబ్దిదారులకు అందలేదన్నారు.దీంతో తనఖాలో ఉన్న పట్టాలను ఆయా లబ్ధిదారులకు తిరిగి ఇవ్వవలసి ఉందన్నారు. వివిధ కారణాలతో కొంత మంది లబ్ధిదారులకు వారి ఇండ్లకు సంబంధించిన పత్రాలను తిరిగి ఇవ్వలేదని ఈ అంశంలో ప్రత్యేక దృష్టి సారించాలని వాటిని వాపస్ చేయాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించామని మంత్రి పొంగులేటి తెలిపారు.
Also read: విజయవాడకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా..!