Harish Rao Letter: సిద్దిపేట నియోజకవర్గంపై రాజకీయ కక్షతో రద్దు చేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనుల నిధులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ నేత, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గత పర్యటనల్లో సిద్దిపేట ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనందుకు సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఈనెల 19న సీఎం సిద్దిపేట పర్యటన నేపథ్యంలో పలు అంశాలపై నిలదీస్తూ బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రంలో 100 శాతం రుణమాఫీ జరగలేదని, ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోనే ఇంకా 22,819 మంది రైతులకు మాఫీ కాలేదని హరీశ్ రావు ఆరోపించారు. 45 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతుభరోసా జమ చేస్తామన్నారని.. 230 రోజులు గడిచినా పావు వంతు నిధులు కూడా అందలేదన్నారు. దుద్దెడ వద్ద రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ వెటర్నరీ కళాశాలను రద్దు చేసి కొడంగల్‌కు తరలించడం అన్యాయమన్నారు. దానిని తిరిగి సిద్దిపేటలోనే కొనసాగించాలన్నారు.
రాష్ట్రంలోని 87 నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేసి సిద్దిపేటకు ఎందుకు ఇవ్వలేదని ఈ సందర్భంగా హరీశ్ రావు ప్రశ్నించారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఇక్కడి పాఠశాలల్లో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. మూడు సీజన్లలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నయా పైసా పరిహారం ఇవ్వలేదని, మార్చిలో మీరు ప్రారంభించిన ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రిలో ఇప్పటికీ వైద్య సేవలు మొదలు కాలేదన్నారు.
కాళేశ్వరం రిజర్వాయర్ల పంట కాలువలు, మల్లన్నసాగర్-తపాస్‌పల్లి కాలువ, గౌరవెల్లి రిజర్వాయర్ తుది పనులను నిలిపివేసి సిద్దిపేటపై కరువు రుద్దారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఒక్కొక్కరికి రూ.90 వేలు, పింఛనుదారులకు రూ.72 వేల చొప్పున బాకీ పడ్డారని, 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Also Read: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో తగలబడ్డ బోగీలు.. ఏం జరిగిందంటే?
సిద్దిపేటలో 1000 పడకల ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డు, తోర్నాల అగ్రికల్చర్ కళాశాలను ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. అలాగే రంగనాయకసాగర్ టూరిజం ప్రాజెక్టు, కోమటిచెరువు శిల్పారామం, మిట్టపల్లి ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాల, స్పోర్ట్స్ హబ్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లు, సిద్దిపేట-ఇల్లంతకుంట నాలుగు వరుసల రహదారి పక్కన పెట్టిందన్నారు. అంతేకాకుండా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను ప్రభుత్వం ఆపేసిందని ఆరోపించారు. నాపై రాజకీయ కక్ష ఉంటే నాతో తలపడండి తప్ప సిద్దిపేట ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటం ఆడవద్దని లేఖలోహితవు పలికారు.