Keesara POCSO: మైనర్ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నేరేడ్‌మెట్‌లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. నిందితుడికి రూ.1,000 జరిమానా విధించడంతోపాటు బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడ రాజీవ్‌గాంధీ గృహకల్ప కాలనీకి చెందిన మహమ్మద్ జహీర్ అలియాస్ అబ్దుల్ అబ్బాస్ (38) తన 14 ఏళ్ల కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. 2025 జులై 15న ఉదయం బాలికను తనతో పడుకోవాలని కోరడంతోపాటు, అసభ్యంగా ప్రవర్తించి చేయి పట్టుకుని లాగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక ప్రతిఘటించి అతడి నుంచి తప్పించుకుంది. ఈ ఘటనపై తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో బాలిక వయసును ధ్రువీకరించిన పోలీసులు సాక్షుల వాంగ్మూలాలు సేకరించి, అవసరమైన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. 2025 ఆగస్టు 22న నిందితుడిని అరెస్టు చేసి, దర్యాప్తు అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి చిట్టిబొమ్మ ఆశాలత శిక్ష ఖరారు చేశారు. కేసు దర్యాప్తు అధికారి ఎస్‌ఐ ఆర్.లక్ష్మణ్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శ్రీనివాస్ చారి కృషితో నిందితుడికి శిక్ష పడిందని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది.
Also read: విజయవాడకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా..!