Ganja Cultivation: స్వేచ్చ బ్యూరో: గంజాయి సాగుపై ఉక్కు పాదం మోపుతామని ఎస్సై కళ్యాణ్ కుమార్ హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బోయలగుడెం గ్రామ శివారులో గంజాయి సాగు కలకలం రేపింది. పొలంలో అక్రమంగా గంజాయి పెంచుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా బోయలగుడెం శివారులోని రైతు గోవిందు (లింగపురం గ్రామం) పొలంలో సాగు చేస్తున్న నాలుగు గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమంగా సాగు చేస్తున్న సదరు రైతుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై గట్టు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడైన రైతును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. మండలంలో ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Also Read: తెలంగాణ ఖైదీలకు.. కార్పొరేట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్న జైళ్ల శాఖ!