Kodangal Development: ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లడారు. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సేవలందించారని సీఎం గుర్తు చేశారు. ఆ తరువాత పాలమూరుకు వివిధ అవకాశాలు దక్కినా జిల్లా అభివృద్ధిలో ముందుకు వెళ్లలేదు. తెలంగాణ వస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుందని ఆనాడు విఠల్ రావు గారిని కాదని 2009 లో ప్రజలు కెసీఆర్ ని పార్లమెంటుకు పంపారు.
కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మక్తల్ కొడంగల్ నారాయణ్ పేట్ ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తవుతాయని అంతా అనుకున్నారు. 2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఉంటే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవి, ఈ ప్రాంత ప్రజల కల నెరవేరేదని అన్నారు. పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కేసీఆర్ కు ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగు నీరు అందించాలన్న ఆలోచన చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు ఇస్తామన్నా లెక్కచేయక ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం కట్టించారు.
పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చారు. కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూలింది వాళ్ల హయాంలోనే.. కాళేశ్వరం అవకతవకలపై మేం సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఢిల్లీకి వెళ్లి మోడీ ముందు మోకరిల్లి సీబీఐ విచారణ జాప్యం చేయాలని కోరింది మీరు కాదా? ఆనాడు హరీష్ రావు తనను కాళేశ్వర రావు అని పొంగిడించుకున్నారు. ఇప్పుడు మేడిగడ్డ పేరెత్తితే ఎందుకు భయపడుతున్నారని అన్నారు. కన్నెపల్లి పంప్ హౌసుల నుంచి నీళ్లు వదలాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
దేవాదుల నుంచి నీళ్లు సీతారామ ద్వారా ఖమ్మం రైతులకు అందించామని, సమ్మక్క సారలమ్మ నుంచి దేవాదుల ద్వారా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా రైతాంగానికి అందిస్తున్నామని, కన్నెపల్లి పంపులను ఆన్ చేసి నీళ్లు ఎత్తితే మరి మేడిగడ్డ ఎందుకు కట్టారనిఅన్నారని అన్నారు. మూడు పంపులు ఏకకాలంలో పనిచేసినప్పుడే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతది. మీ కాసుల కక్కుర్తి వల్లే మేడిగడ్డ కూలింది. ఈ కరువు కాలంలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి. తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టుతో ఇవాళ లక్షలాది ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు.
Also Read: రేసుగుర్రం అనుకుంటే కీలుగుర్రంగా మారిన సీఎం రేవంత్: కవిత ఎద్దేవా
వాస్తవాలని వక్రీకరించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ వేదికగా స్పీకర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని.. డిసెంబర్ లో ఎల్ నినో, కాళేశ్వరం, గోదావరి జలాలపై రెండు రోజుల చర్చకు అనుమతివ్వండని అన్నారు. కెసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను మొత్తం తెచ్చుకొనీ.. నిజాలు బయట పెట్టి తాట తీస్తాంమని సీఎం రేవంత్ అన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కొడంగల్ కు ఏం చేశారు? కృష్ణా రైల్వే లైన్ ను అడ్డుకున్నది మీరు కాదా? సిమెంటు ఫ్యాక్టరీలు రాకుండా అడ్డుకున్నారు. సాగు నీరు ఇవ్వలేదు, తాగు నీరు ఇవ్వలేదు.. చదువుకునే అవకాశాలు ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఏర్పడ్డాక మక్తల్ నారాయణపేట ఎత్తిపోత పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.
ఆనాడు ఎకరానికి పరిహారం 2 లక్షలు కూడా ఇవ్వలేదు.. మా శ్రీహరి రైతులకు ఎకరానికి 20 లక్షలు ఇచ్చారు. కొడంగల్ బాగుపడుతుందని కడుపునిండా విషం పెట్టుకుని.. అవినీతి జరిగిందని విషం చిమ్ముతున్నారు. మీరు ఇచ్చిన ఈ అవకాశంతో మూడేళ్ళల్లో ఇక్కడి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, ఢిల్లీ నుంచి నోయిడా ముంబై నుంచి పూణే వరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందో.. హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ వరకు అభివృద్ధి చేసి దేశానికే మోడల్ గా తీర్చి దిద్దుతామని అన్నారు. కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చి దిద్దుతున్నామని, తాండూరు పప్పును ప్రపంచంలోని దేశాలకు ఎగుమతి చేసేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు.
కొడంగల్ దేశానికే ఒక అభివృద్ధి చెందిన మోడల్ గా తీర్చి దిద్దుతామని, RARE ఎడ్యుకేషన్ హబ్, RARE ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. 10 వేల కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించుకోబోతున్నామని, పదేళ్లు రాజకీయాలకు అతీతంగా కొడంగల్‌ను అభివృద్ధి చేసుకుందామన్నారు. మీకంటే నాకు ఆత్మ బంధువులు ఎవరూ లేరని.. అందరికీ రేపు దీపావళి.. కొడంగల్ ప్రజలకు ఇవాళే దీపావళి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాకు ప్రజల అభిమానం ఉందని నన్ను చూసి ఒకాయన గడ్డం పెంచుకున్నాడట.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క పులి కాదు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన నువ్వు రేవంత్ రెడ్డి కాలేవని, పది జన్మలు ఎత్తినా నువ్వు కేటీఆర్ అవుతావు తప్ప రేవంత్ రెడ్డివి కాలేవని అన్నారు.
రేవంత్ రెడ్డి కావాలంటే కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే ధైర్యం ఉండాలి. పిడుగులు మీదపడ్డా నమ్మినవాడి కోసం నిలబడే తెగువ ఉండాలి. ఆయనకు గడ్డం రావడానికి 50 ఏండ్లు పట్టింది.. బుద్ది రావడానికి ఎన్నేళ్లు పడుతుందో అని సీఎం సెటెర్లు వేసారు. వేషాలు మార్చి.. భాషా మార్చినా బుద్ధి రానంత వరకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. రైతులకు ఈ వేదికగా పిలుపునిస్తున్నానని, ఎల్ నినో కరువు వస్తుంది. ఆరుతడి పంటలు వేయండని అన్నారు. ప్రభుత్వం మీ మేలు కోరుతోంది. మీకు అండగా నిలవాలనుకుంటోందని, బావ, బామ్మర్దులు చెప్పే మాటలు వింటే మన్ను పోసి అంబలి కాచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ మేలు కోరే సోదరుడిగా చెబుతున్నా జాగ్రతగా ఆలోచించి పంటలు వేయండి. సంక్రాంతి తరువాత ప్రజా బలం కార్యక్రమంతో ప్రతీ గ్రామానికి వచ్చి అందరినీ కలుస్తానని ఎల్ నినో కరువును మనమందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read: కొత్తవి కొనకండి! పాడైపోయిన బల్బులను ఇలా క్షణాల్లోనే రిపేర్ చేయండి!