Medchal Water: స్వేచ్చ బ్యూరో: ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్, పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో 40 శాతానికి పైగా జనాభా ఇప్పటికే ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. బోర్లు ఎండిపోవడం, నల్లా నీరు అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండటంతో ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా శనివారం తాగునీరు వృథా అయింది.
ఒకటో రెండో డ్రమ్ముల నీరు కాదు.. ఏకంగా లక్షల లీటర్ల నీరు వృథాగా రోడ్డుపాలైంది. రైల్వే స్టేషన్ రోడ్డులోని పోస్టాఫీసు ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంక్ నిండిపోవడంతో నీరు రోడ్డుపైకి ప్రవహించింది. దీంతో రోడ్డంతా చెరువును తలపించేలా మారింది.అదేవిధంగా వినాయక్ నగర్‌లోని మిషన్ భగీరథ సంప్ కూడా నిండిపోయి లక్షల లీటర్ల నీరు వృథాగా పోయింది. సంప్‌లోని మోటార్లను ఆన్ చేసి వదిలేయడం, పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ నీటి వృథా జరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, కిష్టాపూర్–మేడ్చల్ మార్గంలో రోడ్డుపక్కన ఉన్న ట్యాంకుకు కొద్ది దూరంలో పైపులైన్ పగిలిపోవడంతో నీరు వృథాగా ప్రవహిస్తోంది.
నీటి సరఫరా చేసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొంటోంది. దాదాపు ఏడాది కాలంగా ఈ సమస్యను పరిష్కరించడం లేదని మాజీ కౌన్సిలర్ తుడుం గణేశ్, స్థానికులు తెలిపారు.చుక్కచుక్క నీటిని ఒడిసిపట్టి వినియోగించుకోవాల్సిన పరిస్థితుల్లో లక్షల లీటర్ల తాగునీరు వృథా అవుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని, పగిలిన పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Also Read: ఐదుగురు సినిమా చూడాలంటే రూ.7 వేల ఖర్చు.. టికెట్ ధరలపై శరత్ ఫైర్