Prison Reforms: స్వేచ్చ బ్యూరో: ఖైదీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది రాష్ట్ర జైళ్ల శాఖ. కారాగారాలంటే శిక్షను అమలు చేసే కేంద్రాలు మాత్రమే కాదని చాటి చెబుతోంది. తెలిసో తెలియకో క్షణికావేశంలో పరిస్థితుల ప్రభావంతో నేరాలు చేసి జైళ్లకు వస్తున్న వారిని సంస్కరిస్తుండటంతోపాటు విడుదలైన తర్వాత ఖైదీలు గౌరవంగా బతికేలా చర్యలు తీసుకుంటోంది. మాదకద్రవ్యాల మత్తులో చిక్కుకున్న వారిని దాంట్లో నుంచి బయట పడేస్తోంది. శిక్ష ముగించుకుని బయటకు వెళ్లిన తర్వాత కూడా వారిని ఫాలో అప్ చేస్తూ మరోసారి మత్తు ఊబిలో చిక్కకుండా చర్యలు తీసుకుంటోంది. దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును గెలుచుకుంది.
ఖైదీలలో మానసిక ఒత్తిడి, నిరాశ, ప్రతికూల ఆలోచనలు, ఆత్మహత్యా ధోరణులను తగ్గించడానికి ఇటీవల జైళ్ల శాఖ ‘ఉల్లాసం’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంట్లో భాగంగా చంచల్ గూడ కేంద్ర కారాగారం, మహిళా జైళ్లలోని ఖైదీలకు వ్యాయామాలే కాకుండా వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలు, సంగీతం (ట్రెస్టిల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ భాగస్వామ్యంతో) వినోద కార్యక్రమాలను నిర్వహించారు. దీనిపై ఖైదీల నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఈ పోటీల వల్ల టీం స్పిరిట్ ప్రాధాన్యతను గుర్తించామని ఖైదీలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఉల్లాసం కార్యక్రమాన్ని దశలవారీగా రాష్ట్రంలోని అన్ని జైళ్లకు విస్తరించునున్నట్టు జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యా మిశ్రా తెలిపారు.
జైళ్లలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి..వ్యసనపరులైన ఖైదీల్లో మార్పు తీసుకురావడానికి నివృత్తి డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది ఖైదీలకు స్క్రీనింగ్ నిర్వహించి మత్తుకు అలవాటు పడ్డవారిని గుర్తించారు. వారికి కౌన్సిలింగ్, చికిత్స అందించి మత్తు నుంచి బయట పడేస్తున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా అవసరమైన మద్దతు అందిస్తున్నారు.
‘మహాపరివర్తన్’ కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులైన ఖైదీలను అక్షరాస్యులుగా మార్చడానికి ‘విద్యాదానం’ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జైళ్లలో చదువుకున్న ఖైదీల ద్వారా మిగిలిన వారికి చదువు చెప్పిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఖైదీలు 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఖైదీలను పట్టభద్రులుగా మారుస్తున్నారు. తద్వారా విడుదలైన తర్వాత ఖైదీలు తమ అర్హతకు తగ్గ ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు సృష్టిస్తున్నారు.
Also Read: చెస్ బోర్డ్ మీద ప్రపంచాన్ని జయించాలనుకుంటున్న పదేళ్ల పిల్లాడి కథ… ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ డ్రామా
జైళ్లలోని వర్క్ షాపులను ఉత్పాదక కేంద్రాలుగా మార్చారు. ఖైదీలకు శిక్షణ అందించి స్టీల్ ఫర్నిచర్, ఆస్పత్రి బెడ్లు, క్లాస్ రూమ్ బెంచీలు, సబ్బులు, ఫ్లోర్ క్లీనర్లు, పర్యావరణ అనుకూల వస్తువులను తయారు చేయిస్తున్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం. ఇక, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 32 పెట్రోల్ బంకులను నిర్వహిస్తూ ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ వ్యాపారాల ద్వారా జైళ్ల శాఖకు ఏటా దాదాపు 30 కోట్ల ఆదాయం సమకూరుతోంది. విడుదలైన ఖైదీల కోసం ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
మహిళా ఖైదీల సంక్షేమం మరియు వారి సాధికారత కోసం ‘రిహాయ్’ (రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్ మెంట్ ఇనిషియేటవ్ ఫర్ ఉమెన్ ఇన్ మేట్స్) అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఎన్జీఓల సహకారంతో నిర్వహిస్తున్నారు. దీని ద్వారా మహిళా ఖైదీలకు నైపుణ్య శిక్షణ, ఉపాధి మార్గాలను చూపిస్తున్నారు. తాజాగా మహిళా జైల్లో ఫిలీస్ అండ్ క్రిస్టల్ మెథడ్ సైకోథెరపీ కార్యక్రమాన్ని డీజీ సౌమ్యా మిశ్రా ప్రారంభించారు. మహిళా ఖైదీల్లో మానసిక స్థైర్యాన్ని పెంచి సానుకూల ధోరణిని అలవర్చి సమాజంలో గౌరవంగా జీవించేలా తీర్చిదిద్దటమే ఈ కార్యక్రమ లక్ష్యం.
పౌరులు జైలు జీవితం, క్రమశిక్షణ ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించేలా ‘ఫీల్ ది జైల్’ అనే వినూత్న పర్యాటక..అవగాహన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత మొత్తం చెల్లించి 24గంటలపాటు ఉండేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దాంతోపాటు పాటు జైళ్ల పరిణామ క్రమాన్ని వివరించేలా ‘జైల్ మ్యూజియం’ కూడా ఏర్పాటు చేశారు. స్వాతంత్రానికి ముందు జైళ్లు ఎలా ఉండేవి?.. ఎలా మారుతూ వచ్చాయి? అన్నదానిపై అవగాహన కల్పిస్తున్నారు.
జైళ్ల నిర్వహణ..భద్రతను పెంపొందించడానికి ఆధునిక సాంకేతికతను జోడించి ‘స్మార్ట్ జైళ్లు’గా మారుస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐ ఆధారిత సీసీ కెమెరాల నిఘా, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ (ముఖ గుర్తింపు), బయోమెట్రిక్ డేటాబేస్, అడ్వాన్స్ డ్ స్కానింగ్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. కోర్టులకు, జైళ్లకు మధ్య ఖైదీల తరలింపు భారాన్ని తగ్గించడానికి ‘వీడియో లింకేజ్ సిస్టమ్’ ద్వారా డిజిటల్ విచారణలు సాగిస్తున్నారు. అలాగే పరిపాలనలో పారదర్శకత కోసం ‘ఇ-ఆఫీస్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ సంస్కరణల నేపథ్యంలో ఖైదీల్లో గణనీయ మార్పులు కనిపిస్తున్నాయి. జైళ్లలో ఉన్న సమయంలో పొందిన ఉపాధి శిక్షణ, చదువులతో విడుదలైన తర్వాత చాలామంది గౌరవంగా జీవనం గడుపుతున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర జైళ్ల శాఖ ఇటీవల ప్రతిష్టాత్మకమైన ‘స్కోచ్’ అవార్డును సాధించింది. 2003లో ప్రారంభమైన ఈ పురస్కారాన్ని దేశంలోనే ఒక స్వతంత్ర సంస్థ అందించే అత్యున్నత పౌర గౌరవంగా భావిస్తారు. ప్రభుత్వాలు లేదా పరిశ్రమల నుంచి ఎలాంటి ప్రకటనలు, స్పాన్సర్ షిప్ లు లేకుండా పూర్తిగా నిష్పాక్షిక పరిశోధన, నిపుణుల జ్యూరీ, ప్రజా ఓటింగ్ ఆధారంగా ఈ అవార్డును ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలోనే వేర్వేరు రాష్ట్రాలకు చెందిన జైళ్ల శాఖ అధికారులు తెలంగాణకు వచ్చి ఇక్కడ జైళ్లలో అమలవుతున్న సంస్కరణలను అధ్యయనం చేసి తమ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.
Also Read: చికెన్ కంటే పవర్ఫుల్.. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే 5 సూపర్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!