KBR Flyovers: స్వేచ్ఛ బ్యూరో: అతి వేగంగా అభివృద్ది, పట్టణీకరణ చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టి, సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు ప్రతిపాదించిన హెచక సిటీ పనుల్లో భాగంగా అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్కు చుట్టూ రూ. 1090 కోట్లతో నిర్మించనున్న ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ ల నిర్మాణ పనులు మరో అడుగు ముందుకు పడ్డాయి. మొత్తం పార్కు చుట్టున్న ఫిల్మ్ నగర్, ముగ్ధా, అగ్రసేన్, కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్, రోడ్ నెంబర్ 45తో కలుపుకుని బసవ తారకం హాస్పిటల్ జంక్షన్ల వద్ద మొత్తం 343 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించాల్సి ఉండగా, జీహెచ్ఎంసీ వద్ద నిధుల కొరత ఉండటంతో భూములిచ్చే యజమానులకు ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్ (టీడీఆర్) లు ఇస్తామని ఒప్పించేందుకు ఇప్పటి వరకు నేరుగా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ రెండుసార్లు వారితో నిర్వహించిన సమావేశాలు విఫలమయ్యాయి.
సేకరిస్తున్న స్థలాల విలువకు రెండింతలు విలువ చేసే టీడీఆర్ లకు కొందరు స్థల యజమానులు మాత్రమే అంగీకరించటం, మెజార్టీ సంఖ్యలో స్థల యజమానులు అంగీకరించకపోవటంతో దిగొచ్చిన జీహెచ్ఎంసీ ఎట్టకేలకు 164 ఆస్తుల యజమానులకు నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేస్తూ, డాక్యుమెంట్లను సమర్పించాలని సూచిస్తూ ఇటీవలే ఫైనల్ అవార్డి నోటీసులను జారీ చేసినట్లు సమాచారం. కేబీఆర్ పార్కు చుట్టూ స్థలం ధర గజానికి సుమారు రూ. 3 లక్షల నుంచి నాలుగు లక్షల వరకు పలుకుతుండటంతో జీహెచ్ఎంసీ నష్టపరిహారం రూ.900 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్ల మధ్య చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. స్థలాలిచ్చే యజమానుల్లో ఎక్కువ మంది సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు.
జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఇంత భారీ వ్యయం చెల్లించని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ లిమిట్ ను దాటి వేల కోట్ల రూపాయల అప్పులు చేసి, వాటిని నెలసరి వాయిదాల్లో అసలు, మిత్తీలను కలిపి నెలకు రూ. 120 కోట్లు చెల్లిస్తూ వస్తుంది. అదనంగా అప్పుు పుట్టని పరిస్థితులుండగా, జీహెచ్ఎంసీ స్థల యజమానులకు నష్టపరిహారం చెల్లించేందుకు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదెలా ఉండగా, కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టనున్న హెచ్ సిటీ పనుల్లో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్ లో కూడా మరో 13 ఆస్తులకు, బసవతారకం హాస్పిటల్ జంక్షన్ లోని 21 ఆస్తులకు కూడా త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తామని, డాక్యుమెంట్లు సమర్పించాలని జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.
Also read: Huzurabad: స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్‌లొ కదిలిన ఆర్టీసీ యంత్రాంగం..!
గత గులాబీ సర్కారు హయాంలో సిటీలోని రద్దీ ప్రాంతాల్లో సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ (ఎస్ఆర్ డీపీ)ని రూపొందించి అనేక ప్రాంతాల్లో అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్లు, గ్రేడ్ సెపరేటర్లను కూడా ఏర్పాటు చేసింది. మూడేళ్ల క్రితం ప్రభుత్వం మారటంతో కొత్త ప్రభుత్వం ఎస్ఆర్ డీపీని కాస్త హెచ్ సిటీ పనులుగా మార్చి అమలు చేస్తుంది.
హెచ్ సిటీ లో భాగంగా మొత్తం రూ. 7 వేల కోట్ల వ్యయంతో నగరంలోని వివిధ రద్దీ ప్రాంతాల్లో అయిదు ప్యాకేజీలుగా మొత్తం 23 ప్రాజెక్టుల పనులను చేపట్టాల్సి ఉండగా, అందులో కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టిన పనులు ఒక భాగం. హెచ్ సిటీ పనులకు ఇప్పటి వరకు సర్కారు రూ. 2654 కోట్ల నిధులకు పరిపాలనపరమైన మంజూరీని మాత్రమే ఇచ్చింది గానీ ఇప్పటి వరకు పైసా నిధులు విడుదల చేయలేదని తెల్సింది. నాలుగు త్రైమాసికాల్లో ఈ మొత్తం రూ. 2654 కోట్లను విడుదల చేస్తామని సర్కారు హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు మొదటి త్రైమాసికంగా జీహెచ్ఎంసీకి విడుదల చేయాల్సిన రూ. 163 కోట్ల 50 లక్షలను విడుదల చేయాల్సి ఉంది. నూతన ఆర్థిక సంవత్సరం మొదలై నాలుగో నెల గడుస్తున్నా, ఇంత వరకు నిధులు విడుదల కాలేదు.
Also read: పరిపాలనలో పారదర్శకత.. ‘డిజిటల్ గవర్నెన్స్’కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్