Gadwal Roads: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం.. అధునాతన వసతులు కల్పిస్తాం” అంటూ అట్టహాసంగా పనులు ప్రారంభించిన అధికారులు, తీరా చూస్తే సగం పనులకే మంగళం పాడారు. గద్వాల పట్టణంలోని భీంనగర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి, ఎంక్రోచ్ నిర్మాణా తొలగింపు పేరిట అక్రమణలను తొలగించారు. రోడ్లను తవ్వి విశాలంగా చేశారు. పట్టణ ప్రజలు అంతా హర్షించారు. భీంనగర్ లో మాదిరిగానే పట్టణం మొత్తం విశాలంగా మారుస్తారేమో అని పట్టణ ప్రజలు ఆశించారు. తీరా రోడ్లపై అక్రమణలు తవ్వి అలాగే వదిలేయడంపై స్థానిక వ్యాపారస్తులు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో రోడ్లను గెలికి, అసంపూర్తిగా వదిలేయడం వల్ల “ఏం సాధించారు?” అంటూ గద్వాల మున్సిపల్ యంత్రాంగాన్ని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ఎంక్రోచ్ మెంట్ నిర్మాణ పనులు ప్రారంభించి రోజులు గడుస్తున్నా.. పలుచోట్ల షాపుల ముందు తవ్విన మట్టి, రాళ్ల కుప్పలను తొలగించడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. షాపుల ముందే పెద్ద ఎత్తున మట్టి కుప్పలు పేరుకుపోవడంతో కస్టమర్లు రావడానికి జంకుతున్నారు. దీంతో వ్యాపారాలు సాగక, షాపుల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు మున్సిపల్ అధికారులు గానీ, ఇటు కొందరు షాప్ యజమానులు గానీ ఈ సమస్యపై కనీసం స్పందించకపోవడం గమనార్హం.
ప్రస్తుతం వానకాలం ప్రారంభం కావడంతో, తవ్వి వదిలేసిన గుంతలన్నీ నీటితో నిండి కుంటలను తలపించే ప్రమాదం పొంచి ఉంది. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో వాహనాలన్నీ రోడ్లపైనే నిలపాల్సి వస్తోంది. ఫలితంగా భీంనగర్ ఏరియాలో యాధావిధిగా ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతున్నాయి. నిత్యం వాహనదారులు, పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వానకాలం పూర్తిగా ముంచుకొచ్చేలోపే మున్సిపల్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే రోడ్డుపై ఉన్న మట్టి, రాళ్ల కుప్పలను తొలగించి, రోడ్డు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also read: Belt Shops: కమలాపూర్ గ్రామపంచాయతీ సంచలన నిర్ణయం.. అలా చేస్తే మహిళల చేతిలో దాడి..!
గద్వాలలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా రోడ్లు గుర్తించకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు నిత్య కృత్యమయ్యాయి. అధికారులు ఈ మేరకు వాణిజ్య సముదాయాల ముందు సెట్ బ్యాక్ చేపట్టకుండా నిర్మాణాలు చేపట్టి రోడ్లపై దుకాణాల ముందు విశాలంగా నిర్మించుకొని అదనంగా టీ స్టాల్ లో ఇతరత్రా దండాలు చేస్తున్న వాటిని తొలగించారు. కేవలం బీమ్ నగర్ కృష్ణవేణి చౌక్ ఏరియాలో విస్తరణ చేపట్టారు. పాత బస్టాండ్ ఏరియాకు గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. దీంతో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రథశాల ముందు సమీపంలో పండ్ల తోపుడు బండ్లు అక్కడే తిష్ట వేయగా, అనేక తినుబండారాల షెడ్లు నిర్మించుకుని దందా చేస్తున్నారు.వాటిపై అధికారులు నేటికీ తొలగింపు ప్రక్రియ చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఆక్రమణ తొలగింపు చేపట్టకపోవడం వెనక రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయనే కోణంలో సైతం ప్రజలు చర్చించుకుంటున్నారు.
గద్వాల పట్టణాని “సుందరంగా తీర్చిదిద్దుతాం” అంటూ గద్వాల భీంనగర్ ప్రధాన రహదారిపై ఆక్రమణలను తొలగించి, రోడ్లను గెలికి.. తీరా చూస్తే సగం పనులకే మంగళం పాడారు. మున్సిపల్ అధికారులు. నాడు రోడ్లు విశాలం అవుతున్నాయని హర్షించిన ప్రజలకు, నేడు అధికారుల నిర్లక్ష్యంతో “గుండు సున్నా” మిగిలింది. ఆక్రమణలు తవ్వి రోజులు గడుస్తున్నా షాపుల ముందు మట్టి, రాళ్ల కుప్పలను తొలగించలేదు. అటు అధికారులు పట్టించుకోరు, ఇటు ఓనర్లు నిర్మాణాలకు ముందుకు రారు. కస్టమర్లు రాక షాపులను అద్దెకు తీసుకున్న నిర్వాహకులు తీవ్ర నష్టాల్లో మునిగిపోతున్నారు. ఇప్పటికైనా సమయంతో అధికారులు రోడ్ల ఆక్రమణలు తొలగించి, విశాలమైన రోడ్లను వేయడం ద్వారా వాహనాల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటాయని, ఆ కోణంలో పారదర్శకంగా తొలగింపు ప్రక్రియ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Also read: KBR Flyovers: టీడీఆర్ ఒప్పందాలు విఫలం.. హెచ్ సిటీ పనుల్లో మరో అడుగు ముందుకు!