Telangana Govt: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కొద్ది నెలల క్రితం పంచాయతీ, నిన్నమొన్నటి వరకు మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను నిర్వహించిన సర్కారు ఇపుడు జీహెచ్ఎంసీ,(GHMC) సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై దృష్టి సారించినట్లు సమాచారం. పంచాయతీలతో పాటు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పాలక వర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో ఇటీవలే ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో కూడా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి పాలక మండలిలను అందుబాటులోకి తేవాలని సర్కారు యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక సంస్థల్లో పాలక మండలిలు అందుబాటులో ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిధులను ఆర్జించే అవకాశమున్నందున వీలైనంత త్వరగా మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది.
కానీ దేశ వ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభమైన జనాభా లెక్కల సేకరణ (సెన్సస్) జరుగుతున్న సమయలో గ్రేటర్ తో పాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే లీగల్ గా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటే ఏం చేయాలన్న అంశాలపై జీహెచ్ఎంసీ న్యాయ నిపుణలు సలహాలను కోరినట్లు తెలిసింది. మంగళవారం ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి వద్ద జరిగిన జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణ, నిధుల కేటాయింపు, ఆదాయం, ఆస్తుల పంపకాలు, ఎన్నికల నిర్వహణకు ముందు చేయనున్న సన్నాహాల గురించి ప్రస్తావన కూడా వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
జీహెచ్ఎంసీలోకి కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలని గత నవంబర్ 25వ తేదీన సర్కారు జీహెచ్ఎంసీకి ప్రీయాంబుల్ ప్రతిపాదనలను పంపిన వెంటనే స్థానిక సంస్థల విలీనంతో పాటు పెరిగిన విస్తీర్ణాన్ని పునర్విభజించి 12 జోన్లు, 60 సర్కిళ్లుగా ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఆ సమయంలోనే అధికారులు ముందు చూపుతో మూడు కార్పొరేషన్ల ప్రతిపాదనలను కూడా రూపకల్పన చేసి సిద్దం చేసుకోగా, గత 10వ తేదీన జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగిసిన మరుసటి రోజైన 11న మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు సర్కారు ఆమోద ముద్ర వేసింది. మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, సరిహద్దుల నిర్ణయాలు, సర్కిళ్లు, జోన్లను ఫిక్స్ చేసినపుడే ప్రస్తుతం జీహెచ్ఎంసీలోనున్న 150 వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేసి సిద్దంగా ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఆరు జోన్లు 30 సర్కిళ్లు, 150 వార్డులతో ఉన్న జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలంటే కేవలం మేయర్ సీటు రిజర్వేషన్ మాత్రమే ఖరారు చేసి, వార్డుల రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేసుకోవటం మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఈ మూడు కార్పొరేషన్లలోని మెజార్టీ పోలింగ్ స్టేషన్లు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, సర్కారు ఆఫీసుల్లో ఉండటంతో ఎన్నికల నిర్వహణకు వేసవి సెలవులు మంచి సమయమని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. పైగా ఇటీవల జరిగిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను అధికార పార్టీ కైవసం చేసుకున్న జోష్ లోనే ఎన్నికలు నిర్వహిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని సర్కారు అంచనాలు వేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం 74 వార్డులతో మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్, అలాగే 76 వార్డులతో ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో త్వరలోనే మరో సారి వార్డుల పునర్విభజన ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిసింది. వార్డుల పునర్విభజన జరిగినపుడు అధికారులు 45 వేల జనాభా ప్రాతిపదికన విభజన చేస్తూ, పది శాతం ప్లస్, మైనస్ గా వార్డులను ఏర్పాటు చేశారు. అయినా నేటికీ ఈ రెండు కార్పొరేషన్లలోని వార్డుల మధ్య వ్యత్యాసం చాలా ఉన్నట్లు, కొన్ని వార్డుల్లో 30 వేల జనాభా, మరి కొన్నింటిలో 70 వేల వరకు జనాభా ఉన్నట్లు గుర్తించిన అధికారులు త్వరలోనే ఈ రెండు కార్పొరేషన్లలోని వార్డుల సంఖ్యను ఒక్కో కార్పొరేషన్ లో వంద చొప్పున మొత్తం 200 వార్డులుగా విభజించి, వాటి రిజర్వేషన్లను, ఈ రెండు కార్పొరేషన్ల మేయర్ సీటు రిజర్వేషన్లను ఖరారు చేసినానంతరం తాము ఎన్నికలకు సిద్దమన్న విషయాన్ని సర్కారుకు తెలిపితే, ఆ తర్వాత ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ జారీ చేసే అవకాశముంది. ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రాథమికంగా ఇప్పటికే మొదలు కావటంతో అన్ని రకాల ఏర్పాట్లు జరిగి మే నెలాఖరులో గానీ, జూన్ మొదటి వారంలో గానీ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలిసింది.