GHMC Sports: స్వేచ్ఛ బ్యూరో: యాంత్రికమైపోయిన పట్టణ ప్రజల జీవన శైలిలో మార్పులు తీసుకువచ్చి, క్రీడల వైపు ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ముఖ్యంగా పాఠశాల స్థాయి విద్యార్థులను క్రీడల పట్ల ఆకట్టుకునే దిశగా చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్లే గ్రౌండ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఓపెన్ జిమ్ ల ప్రస్తుత పరిస్థితులను నేరుగా పరిశీలించి, ప్రస్తుతమున్న పరిస్థితితో పాటు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ప్లే గ్రౌండ్లు, స్విమ్మింగ్ పూల్స్ అవసరమో? సూచిస్తూ నివేదికలను పంపాలని ఉన్నతాధికారులు అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
పక్షం రోజుల్లో పూర్తి స్థాయి నివేదికలను పంపాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. కోర్ అర్బన్ రీజియన్ పరిధి మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటైన తర్వాత కొత్తగా ఏర్పడిన జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 342 ప్లే గ్రౌండ్లు, 18 స్విమ్మింగ్ పూల్స్, మరో సుమారు వంద వరకు ఓపెన్ జిమ్స్ ఉన్నట్లు, వాటి తాజా పరిస్థితిపై నివేదికలు తెప్పించుకున్న తర్వాత అక్కడున్న పరిస్థితులను బట్టి వాటిలో సౌకర్యాలను మెరుపర్చాలని భావిస్తున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ప్రాథమికంగా తెప్పించిన సమాచారం ప్రకారం కొన్ని పార్కుల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లలో వ్యాయామం చేసే పరికరాలు చాలా వరకు కనుమరుగైనట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ ఈ వ్యవహారంపై విచారణకు కూడా ఆదేశించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నెల 25 నుంచి ఒక వైపు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూనే, మరో వైపు క్రీడా మైదానాలు, ఓపెన్ జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ ను మెరుగుపర్చాలని భావిస్తున్నట్లు తెలిసింది. చాలా ప్లే గ్రౌండ్స్ కు కనీసం ప్రహరీగోడలు కూడా లేనట్టు గతంలో జీహెచ్ఎంసీ గుర్తించింది. అలాంటి ప్లై గ్రౌండ్ లలో తాజాగా పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నివేదికలు సమర్పించాలని అధికారులు ఆదేశించారు. వీటిలో ఏమైనా అక్రమణలు వచ్చి ఉంటే వెంటనే నివేదికలను సమర్పించాలని కూడా సూచించినట్లు తెలిసింది. దీంతో పాటు కొత్తగా ప్లే గ్రౌండ్ల ఏర్పాటు, ఇప్పటికే అభివృద్ది కోసం ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించిన పలు స్టేడియంల నిర్మాణ పురోగతిని కూడా నివేదికల్లో పేర్కొనాలని సూచించారు.
Also Read: విజయ్ రాజకీయ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఒక వేళ నిర్మాణం మొత్తం పూర్తయి ఉంటే, వెంటనే ఆ స్టేడియంను, ప్లే గ్రౌండ్ ను ఇంజనీరింగ్ విభాగం నుంచి క్రీడల విభాగానికి అప్పగించేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టాలని పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సిటీలోని కాప్రా, రెడ్ హిల్స్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఫుట్ బాల్ స్టేడియంల పనులను కూడా ఆయా సర్కిల్లకు చెందిన అధికారులు పరిశీలించి, పనుల పురోగతిపై నివేదికలను సమర్పించాలని సూచించినట్లు తెలిసింది. ఈ రెండు ఫుట్ బాల్ స్టేడియంలకు ఇప్పటికే గత పాలక మండలి హయాంలోని స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే.
ఈ నెల 25వ తేదీ మే 31వ తేదీ వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్లే గౌండ్లలో, స్టేడియంలలో సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ లను నిర్వహిస్తున్నందున, ఈ నెలాఖరుకల్లా ప్లే గ్రౌండ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఓపెన్ జిమ్ ల స్థితిగతులపై నివేదికలను సమర్పిస్తే, సమ్మర్ క్యాంప్ లలో భాగంగా అదనపు పరికరాలను సమకూర్చటం వంటి పనులు ప్రారంభించేందుకు వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తూనే అవసరమైన చోట కొత్త ప్లే గౌండ్ లను ఏర్పాటు చేసే యోచనలో అధికారులున్నారు. ఇందుకు గాను కాలనీల్లోని లే ఔట్లలో పార్కులకు, ప్లే గ్రౌండ్ లకు కేటాయించిన స్థలాలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ, జీహెచ్ఎంసీకి చెందిన స్థలాలను సర్కిల్ స్థాయి అధికారులు గుర్తించి, నివేదికలను పంపితే వీలైనన్ని ఎక్కువ ప్లే గ్రౌండ్ ను, ప్లే గ్రౌండ్స్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో కొన్నింటిని పార్కులుగా, పిల్లలకు అమ్యూజ్ మెంట్ పరికరాలను కూడా ఏర్పాటు చేసి, అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read: ట్రాయ్ గుడ్ న్యూస్.. త్వరలో వాయిస్ ఓన్లీ ప్లాన్స్.. మెుబైల్ యూజర్లకు పండుగే!