GHMC: దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఎదిగిన జీహెచ్ఎంసీ పౌర, అత్యవసర సేవల నిర్వహణతో పాటు అవసరమైన అభివృద్దికి సంబంధించి తీసుకునే నిర్ణయల్లో కీలక పాత్ర పోషించే పాలక మండలి గడువు ఇంకా వారం రోజుల్లో ముగియనుంది. 2020 డిసెంబర్ మాసంలో కరోన్ సెకండ్ వేవ్ ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరగగా, అప్పటి అధికార గులాబీ పార్టీ అఖిండ విజయం సాధించింది.
డిసెంబర్ మాసంలోనే పాలక మండలికి ఎన్నికల జరిగినా, 2021 ఫిబ్రవరి 11న పాలక మండలి సభ్యులు ప్రమాణం చేయటంతో పాటు అదే రోజు మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా శ్రీలత శోభన్ రెడ్డిలు బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చిన పాలక మండలి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి చెందిన ఆరు వార్షిక బడ్జెట్ లను ప్రవేశపెట్టి, ఆమోద ముద్ర వేసింది. అయిదేళ్లు పదవీ కాలంలో ఆరు వార్షిక బడ్జెట్ లను ప్రవేశపెట్టిన ఘనత ప్రస్తుత పాలక మండలి సొంత చేసుకుంది. అయిదేళ్లు పాలక మండలి గడువులో ప్రతి రెండేళ్ల పదవీకాలంతో కొనసాగే రెండు స్టాండింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసి, పలు అభివృద్ది ప్రతిపాదనలకు, పౌర సేవలకు సంబంధించిన వ్యవహారాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయిదేళ్లలో పెద్దగా చెప్పుకునే స్థాయిలో సంచలన నిర్ణయాలేమీ తీసుకోకపోయినా కార్పొరేటర్ల జీవిత భీమా, స్టడీ టూర్ల పేరిట జల్సాల ప్రతిపాదనలకు మాత్రమే ఏ మాత్రం ఆలస్యం కాకుండా ఆమోద వేసుకుందన్న అప్రతిష్టను సైతం ఈ పాలక మండలే మూట గట్టుకుంది. కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాల కన్నా స్టాండింగ్ కమిటీలోనే టేబుల్ ఐటమ్స్ ను ఎక్కువగా ఇదే పాలక మండలి తీసుకున్నట్లు కూడా వాదనలున్నాయి. కానీ గతంలో ఏ పాలక మండలి తీసుకోని రెండు అరుదైన నిర్ణయాలకు సంబంధించిన ప్రస్తుత పాలక మండలి ఏకంగా కౌన్సిల్ లోనే తీర్మానం చేసింది.
అందెశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతానాన్ని కౌన్సిల్ సమావేశంలో ఆలపించాలని, అలాగే ప్రతి పాలక మండలి మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్లతో గ్రూప్ ఫొటోలు తీసి, కౌన్సిల్ సమావేశం హాల్ లో పెట్టాలన్న తీర్మానాన్ని కూడా ఇదే పాలక మండలి చేసింది. 2014కు ముందున్న జీహెచ్ఎంసీ పాలక మండలి సభ్యులైన అన్ని పార్టీల కార్పొరేటర్లకు రూ. 3 కోట్ల వరకు కార్పొరేటర్ బడ్జెట్ ఉండేది. కానీ ఆ తర్వాత 2016, 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లకు ప్రత్యేకంగా కార్పొరేటర్ బడ్జెట్ అంటూ కేటాయించలేదు. ఈ విషయాన్ని దాదాపు అన్ని పార్టీల సభ్యులు ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ ప్రశ్నించినా, ఎలాంటి ఫలితం దక్కలేదు.
త్వరలోనే మాజీలు కానున్న ప్రస్తుత జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ప్రస్తుతం ఏటా కార్పొరేటర్ బడ్జెట్ అంటూ కేటాయింపులేమి లేకపోయినా, గత నవంబర్ 25వ తేదీన జరిగిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ప్రతి కార్పొరేటర్ కు రూ. 2 కోట్లను మంజూరు చేస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశంలో ప్రకటించారు. రూ. 2 కోట్లలో రూ. కోటి కి సంబంధించిన ప్రతిపాదనలను నేరుగా కార్పొరేటర్ సమర్పించుకునే అవకాశం కల్పించగా, మిగిలిన రూ. కోటి ప్రతిపాదనలకు సంబంధించి హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి మంజూరీ తీసుకోవాలని నిర్ణయించారు.
కానీ ఇప్పటి వరకు చాలా మంది కార్పొరేటర్లు కేవలం రూ. కోటి ప్రతిపాదనలను మాత్రమే అధికారులకు సమర్పించినట్లు, మిగిలిన రూ. కోటి ప్రతిపాదనలను రూపకల్పన చేసినా, చాలా మంది కార్పొరేటర్లకు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అందుబాటులో లేకపోవటంతో పెండింగ్ లో పడినట్లు సమాచారం. వారం రోజుల్లో అయిదేళ్లు పదవీ కాలం ముగింపు తేదీ దగ్గరపడుతున్నా, ఇంకా చాలా మంది కార్పొరేటర్ల ప్రతిపాదనలకు మంజూరీ లభించక, కార్పొరేటర్లు జోన్, ప్రధాన కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాత జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులున్నా, 144 మంది మాత్రమే కార్పొరేటర్లుండగా, వీరిలో ప్రతి రోజు 20 నుంచి 30 మంది కార్పొరేటర్లు తమ ప్రతిపాదనలకు మంజూరీ కోరుతూ కమిషనర్ కర్ణన్, జోనల్ కమిషనర్లను కలిసి నిధులివ్వాలని కోరుతున్నట్లు తెలిసింది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు జీహెచ్ఎంసీలో అధికారం చేపట్టిన పాలక మండలిల్లో ఏ పాలక మండలికి దక్కని అరుదైన అవకాశం ఈ పాలక మండలికి దక్కిందనే చెప్పవచ్చు. 2007లో అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ లోకి శివారులోని 12 మున్సిపాల్టీల విలీనంతో గ్రేటర్ గా గుర్తిస్తూ అప్పటి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అపుడు ఎంసీహెచ్ లో పాలక మండలి అందుబాటులో లేదు. కానీ తాజాగా గత నవంబర్ 25వ తేదీన పాలక మండలి కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలోనే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి సంబంధించిన ప్రీయాంబుల్ ఉత్తర్వులు నేరుగా కౌన్సిల్ కు వచ్చాయి. విలీనానికి సంబంధించి అధ్యయనం చేసి రిమార్క్స్ సమర్పించాలని కౌన్సిల్ కూడా తీర్మానం చేయటం, ఆ తర్వాత కేవలం పక్షం రోజుల్లోనే విలీనం, పునర్విభజనకు సంబంధించి క్లారిటీ కూడా పాలక మండలి పవర్ లోనే ఉండగా రావటం ఈ పాలక మండలికి దక్కిన అరుదైన అవకాశంగా చెప్పవచ్చు.
Also Read: Jana Sena And BJP: మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ, జనసేన కలిసి పోటీ.. పవన్‌తో కమలనాథుల చర్చలు సఫలం!