GHMC Offices: ఏ ఆఫీసులోనైనా బాసు ఉంటేనే కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వహిస్తారు. కానీ జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో కమిషనర్ విధుల్లో ఉన్నపుడు సైతం అంతంతమాత్రంగా విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది పరిస్థితి ప్రస్తుతం ఆయా రామ్..గయా రామ్ అన్న చందంగా మారింది. పౌర, అత్యవసర సేవలందించాల్సిన జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లోని అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో పారదర్శకత లేకపోవటంతో పాటు అసలు జవాబుదారి తనం కూడా లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సెలవుల్లో వెళ్లటంతో అధికారుల పని తీరు ఇష్టారాజ్యంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కమిషనర్ తన ఛాంబర్ లో ఉన్నపుడే తప్పించుకునే ధోరణిలో వ్యవహారించే అధికారులకు కమిషనర్ సెలవుల్లో వెళ్లటం వరంగా, వివిధ సమస్యలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం,జోన్, సర్కిల్ ఆఫీసులకు రాకపోకలు సాగించే సందర్శకులకు శాపంగా మారిందన్న వాదనలున్నాయి. కమిషనర్ సెలవుల్లో ఉండటంతో వివిధ విభాగాల అధిపతులు, ఆ కింది స్థాయి అధికారులు ఎవరు ఎపుడొస్తున్నారు? ఎపుడు వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం సందర్శన వేళల్లోనూ విభాగాధిపతులు తమ ఛాంబర్లలో అందుబాటులో లేకపోవటంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రకరకాల సమస్యలపై ట్యాంక్ బండ్ లోని ప్రధాన కార్యాలయానికి వస్తున్న సందర్శకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో ఆగని అవినీతి రాజాలు.. వరుసగా ఏసీబీకి చిక్కుతున్న అధికారులు
ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు, ట్యాక్స్ సమాచారంలో సవరణలతో పాటు ఇంజనీరింగ్ పనులు, దోమలు, కుక్కల బెడద తో పాటు ఇతర పౌర సేవల నిర్వహణకు సంబంధించిన సమస్యలతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ప్రతి రోజు వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. కమిషనర్ విధి నిర్వహణలో ఉన్నమామూలు రోజుల్లో కనీసం వీరిలో కనీసం సగం మందికైనా విభాగాధిపతులు కలిసి, తమ సమస్యను అప్పటికపుడు పరిష్కరించకపోయినా, కనీసం పరిష్కార మార్గాన్ని చూపే వారు. కమిషనర్ కర్ణన్ సెలవుల్లో వెళ్లటంతో ఇక మననెవరు అడిగేదాని భావించిన అధికారులు తమ ఛాంబర్లలో కూడా అందుబాటులో లేకపోవటంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రధాన కార్యాలయానికి వస్తున్న సందర్శకులు ఇంటి ముఖం పడుతున్నారు.
ఇదిలా ఉండగా, సర్కిళ్లలో ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ల వద్ద పెండింగ్ లో ఉన్న తమ సమస్య పరిష్కారం కాలేదన్న విషయాన్ని జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేసేందుకు వస్తున్న సందర్శకులకు సైతం నిరాశే మిగులుతుంది. జోనల్ కమిషనర్లలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారెవరూ కూడా సందర్శనల వేళల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని జోనల్ కమిషనర్ ఆఫీసులకు వచ్చిన పలువురు సందర్శకులు వాపోయారు.
సందర్శన వేళలైన మధ్యాహ్నాం మూడు గంటల నుంచి అయిదు గంటల వరకు ఖచ్చితంగా ప్రధాన కార్యాలయం, జోన్, సర్కిల్ ఆఫీసుల్లోని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న నిబంధనలున్నా, వాటినెవరూ పాటించటం లేదని సందర్శకులు వాపోతున్నారు. ప్రధాన కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కమిషనర్ ఛాంబర్ ఆయన విధి నిర్వహణలో ఉన్నపుడు సందర్శకులతో సందడిగా కన్పించేది. కొన్ని సందర్భాల్లో సందర్శకుల జాతరగా దర్శనమిచ్చేది. విధి నిర్వహణలో ఉన్నపుడు కమిషనర్ ఒక్కరే ప్రతి రోజు దాదాపు 500 నుంచి 600 మంది సందర్శకులను కలిసి, వారి సమస్యలను స్వీకరించి, సంబంధించి విభాగానికి రిఫర్ చేసే వారు. కానీ ఆయన ఇపుడు లీవ్ లో ఉండటంతో కమిషనర్ ఛాంబర్ కూడా నిర్మానుష్యంగా మారింది.
జీహెచ్ఎంసీలో ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వివిధ క్యాటగిరీల అధికారులకు జీహెచ్ఎంసీ నిధులతో సెల్ ఫోన్, సిమ్ నెంబర్లను కేటాయించారు. కానీ నగరంలోని సామాన్యులు వర్షాలు భారీగా కురిసినపుడు, రోడ్లు బాగా దెబ్బతిన్నపుడు, ఇరత సమాచారం కోసం ప్రకృతి వైపరీత్యాలు జరిగిన సమయంలో కార్పొరేటర్లు ఫోన్లు చేసినా, నాట్ రెస్పాన్స్ అనే సమాధానం మాత్రమే వస్తుందని మరి కొందరు కార్పొరేటర్లు ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. కార్పొరేటర్ల ఫోన్లకే దిక్కు లేదంటే ఇక కామన్ మెన్ కాల్ పట్ల అధికారులెలా స్పందిస్తారో అంఛనా వేసుకోవచ్చు.
కార్పొరేషన్ కు ప్రజలు వివిధ రకాలుగా చెల్లిస్తున్న పన్నులు, ఛార్జీలు, అనుమతుల ఫీజులు వంటి ఆదాయంతోనే అధికారులకు అన్ని రకాల సదుపాయాలను, సెల్ ఫోన్ ను సమకూర్చినా, ఆశించిన ఫలితం దక్కటం లేదు. మరి కొందరు అధికారులు కేవలం తన ఫోన్ లో సేవ్ చేసుకున్న నెంబర్లను మాత్రమే లిఫ్టు చేస్తుండగా, ఎంటమాలజీ, వెటర్నరీ, ట్యాక్స్ విభాగాలకు సంబంధించిన కొందరు అధికారుల ఫోన్ నెంబర్లు తెల్సుకుని సామాన్యులు ఫోన్ చేస్తే దాదాపు రెస్పాన్స్ కారు. ఒక వేళ రెస్పాన్స్ అయినా నా నెంబర్ నీకెవరిచ్చారు. ఎందుకు ఫోన్ చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నట్లు కూడా మరి కొందరు ఆరోపించారు.