Hyderabad News: నిబంధనలు ఉల్లఘించినవారిపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపించనుందా? వర్షాలు పడితే రోడ్లపైకి నీరు రావడానికి గల కారణాలు గుర్తించిందా? ఆదివారం రివ్యూ మీటింగ్‌లో మంత్రి పొన్నం ఎందుకు అసహనం వ్యక్తం చేశారు? ఆ తరహా వ్యక్తులపై చర్యలకు సిద్ధమైందా? సీసీటీవీ కెమెరాలపై పరిశీలించి వారిపై కఠిన చర్యలు తీసుకోనుందా? అవుననే అంటున్నారు అధికారులు.
గడిచిన వారం రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం తడిచి ముద్దవుతోంది. సాయంత్రం అయితే చాలు వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఫలితంగా వివిధ ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇక ట్రాఫిక్ గురించి చెప్పనక్కర్లేదు. గంటల తరబడి వాహనాలు ఆ వ్యూహంలో చిక్కుకుంటున్నాయి.
పరిస్థితి గమనించి సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సిటీలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అధికారులతోపాటు బాధితుల నుంచి సమాచారం తీసుకున్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్.. జీహెచ్ఎంసీ ఆఫీసులో వివిధ విభాగాల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
చిన్నపాటి వర్షం పడితే రోడ్లపై డ్రైనేజి నీరు వస్తోందని చెప్పారు అధికారులు. అందుకు కారణాలను సైతం వివరించారు. నాలాల్లో వ్యర్థాలు పారేస్తున్నారని, దానివల్ల డ్రైనేజీ సమస్య ఏర్పడుతోందన్నారు. మురుగు రహదారులపైకి రావడంతో కాలనీలు మునుగుతున్నాయని అన్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు.
ALSO READ: కొన్ని గంటల్లో ఆ ఏరియాల్లో భారీ వర్షం, కుమ్మడే కుమ్ముడు
సరస్సులు, చెరువులు, కాలువల్లో నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేత వ్యర్థాలను వేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సదరు మంత్రి. సీసీటీవీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షం కురిసిన ప్రతిసారీ నీళ్లు నిలిచిపోవడం, ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందన్నారు.
భవిష్యత్ ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశించారు. వర్షాకాలంలో హైదరాబాద్‌కు వరద సమస్య ఇప్పటిది కాదన్నారు.
భారీ వర్షాలు పడినప్పుడు అత్యవసర విధుల్లో ఉండాల్సిన అధికారుల సెలవులను రద్దు చేయాలన్నారు మంత్రి. వర్షాకలం పూర్తయ్యే వరకు ఆయా విభాగాలు 24 గంటలపాటు పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి సాయం కావాలంటే నేరుగా అధికారులు తనను సంప్రదించాలన్నారు.
వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశానికి మేయర్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, జోనల్ కమిషనర్లు హాజరయ్యారు.