KTR Scam :
⦿ ప్రజలు ఛీ కొట్టిన మారని తీరు
⦿ కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం
⦿ ఫ్యామిలీ మొత్తం అవినీతిపరులే
⦿ తెలంగాణ పరువు తీస్తున్నారు
⦿ లిక్కర్ కేసులో కవిత.. ఈ కార్ రేస్‌లో కేటీఆర్
⦿ సీఎంపై నోరుజారితే జాగ్రత్త
⦿ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శలు
హైదరాబాద్, స్వేచ్ఛ : ప్రపంచ దేశాల్లో తెలంగాణ పరువు తీసి.. నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విదేశీ సంస్థలకు రూ. 55 కోట్లు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం పోయిందనే అక్కసుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నోరు జారుతున్నారని మండిపడ్డారు.
లిక్కర్ స్కాం కేసులో జైలుకు వెళ్లిన కేటీఆర్ చెల్లెలు దేశంలో తెలంగాణ పరువు తీసిందని.. ఫార్ములా ఈ కేసులో అవినీతికి పాల్పడి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను దిగజార్చావని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర పైసా అవినీతికి పాల్పడలేదని చెబుతున్న కేటీఆర్.. అనుమతి లేకుండా రూ.55 కోట్లు ఎలా పంపించారని.. తెలంగాణ ప్రజలు సంపద.. మీ అయ్య సొమ్ము అనుకున్నావా అని నిలదీశాడు. తెలంగాణ సంపదను విదేశాలకు అప్పనంగా దోచి పెట్టి.. ఇంకా నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డ నని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు.
కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని.. ఇకనైనా కేటీఆర్ తన బుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. మీరు చేసిన అప్పులు, తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్నీ ఛీ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా.. అహంకారం తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలుకు వెళ్తూ వెళ్తూ సీఎంపై నోరు జారితే జాగ్రత్త అని హెచ్చరించారు. మతి భ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు.
Also Read : ‘భూ భారతి’కి గవర్నర్ ఆమోదం.. చట్టంగా త్వరలోనే అమల్లోకి.. రానున్న మార్పులివే..