Hyderabad: పేరుకేమో నందనవనం కాలనీ. అక్కడో అడ్డా ఏర్పాటు చేసుకుంది గంజాయి బ్యాచ్. మైనర్ బాలికపై అయూబ్ అనే కీచక రౌడీషీటర్ కొన్నాళ్లుగా కన్నేశాడు. ఇంటిపై దాడి చేసి.. మరో ఇద్దరితో కలిసి అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ దుర్మార్గులకు మరో నలుగురు సహాయపడ్డారు. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఈ గ్యాంగ్‌రేప్ తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ కేసులో పురోగతి సాధించారు రాచకొండ పోలీసులు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లకు సహకరించిన మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో 16 ఏళ్ల బాలికపై గంజాయి బ్యాచ్ గ్యాంగ్‌రేప్ చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, రాచకొండ సీపీని ఆదేశించారు. తక్షణమే బాధితురాలి ఇంటికెళ్లి ఆ కుటుంబానికి అవసరమైన సహాయం చేయాలని రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులను ఆదేశించారు గవర్నర్ తమిళిసై.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్, మీర్‌పేటలో తమ్ముడితో కలిసి బంధువుల ఇంట్లో ఉంటోంది 16 ఏళ్ల మైనర్ బాలిక. ఓ బట్టల షాపులో పని చేస్తోంది. సోమవారం ఉదయం తమ్ముడితో పాటు ఇంట్లో ఉన్న సమయంలో.. ఎనిమిది మంది దుండగులు ఒక్కసారిగా చొరబడ్డారు. వారంతా గంజాయి మత్తులో ఉన్నారు. అందులోని ముగ్గురు.. ఆ బాలిక మెడపై కత్తి పెట్టి.. భవనంపైకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మిగిలిన వారు ఆమె తమ్ముడిని బంధించి కాపలాగా ఉన్నారు. ఈ విషయం వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపింది. రౌడీషీటర్ అయూబ్.. స్థానికంగా గంజాయి దందా చేస్తున్నాడని.. అతని గ్యాంగే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు.