
Governor : తెలంగాణలో కొంతకాలంగా గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. తన ప్రోటో కాల్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గవర్నర్ తమిళిసై ఆరోపించడంతో వివాదం మొదలైంది. గవర్నర్ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండా నిర్వహించి ప్రభుత్వం తమ వైఖరేంటో స్పష్టం చేసింది.
తన విషయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలకు గవర్నర్ కౌంటర్ అంతే దీటుగా ఇచ్చారు. బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపకుండా ప్రభుత్వానికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. దీంతో ఒక మొట్టు దిగిన బీఆర్ఎస్ సర్కార్ గవర్నర్ తో నేరుగా సంప్రదింపులు జరిపింది. గత బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ప్రసంగం పెట్టేందుకు అంగీకారం తెలిపింది. అయితే మరోవైపు పెండింగ్ బిల్లులు వ్యవహారం మాత్రం కొలిక్కిరాలేదు.
ప్రభుత్వం పంపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంలేదని ఆరోపిస్తూ కేసీఆర్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో
పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 బిల్లులను ప్రభుత్వానికి తిరిగి పంపారు. డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లును తిరస్కరించారు. పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. ప్రస్తుతం గవర్నర్ దగ్గర ఎలాంటి పెడింగ్ బిల్లులు లేవని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి.