Govt Employees: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగి మరణాంతరo అయ్యే ఖర్చులను పీఆర్సీ సూచన మేరకు రూ. 20,000 అందిస్తుండగా, ఆ నగదును రూ. 30,000 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న రైతుభరోసాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మరుసటి రోజే ప్రభుత్వ ఉద్యోగుల కోసం కీలక ప్రకటన చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సంధర్భంగా ఇప్పటికే విజయోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల విజయోత్సవ సభలను నిర్వహించగా, భారీ సంఖ్యలో ప్రజలు హాజరై ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించారు. ఏడాది పాలనలో గృహజ్యోతీ, మహిళలకు ఫ్రీ బస్సు పథకం, 50 వేలకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్, రుణమాఫీ, ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ సర్కార్ మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంది.
ఇటువంటి దశలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన ఉద్యోగుల సమస్యలను తెలుసుకొనేందుకు ఇటీవల సీఎం రేవంత్, మంత్రులు వారితో భేటీ అయ్యారు. ఈ సంధర్భంగా ఉద్యోగుల సమస్యలను విన్న సీఎం వారికి దశల వారీగా సమస్యలకు శుభం కార్డు వేస్తానని చెప్పారు.
ఇలా ప్రకటన ఇచ్చిన కొద్దిరోజులకే ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి PRC సూచన మేరకు రూ. 20,000 అందిస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో రూ. 30,000 వేలు అందజేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.